చర్చలతో శాంతి సాధ్యం!
కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ
≈ పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల స్థానంలో రాళ్లా?
≈ కశ్మీర్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు..
≈ మానవత్వం, ప్రజాస్వామ్యం, కశ్మీరియత్ స్ఫూర్తితో చర్చలు
≈ కశ్మీర్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి
≈ ‘70 సాల్ ఆజాదీ-యాద్ కరో కుర్బానీ’ ప్రారంభోత్సవంలో మోదీ
భాబ్రా: నెల రోజులుగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసా కాండపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు మౌనం వీడారు.
ఇన్సానియత్(మానవత్వం), జమ్హూ రియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ స్ఫూర్తితో కశ్మీర్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రజాస్వామ్య మార్గం, చర్చలు ఉన్నాయని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని భాబ్రాలో మాట్లాడుతూ..‘వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్ విధానాన్ని అనుసరించారు. మేం కూడా అదే బాటలో పయనిస్తున్నాం. మానవత్వం, కశ్మీరియత్ దెబ్బతినేందుకు అనుమతించకూడదు. మిగతా భారతీయులకున్నట్లే కశ్మీర్ ప్రజలకు అదే స్వేచ్ఛ ఉంది’ అని చెప్పారు.
యువతను పురిగొల్పుతున్నారు
‘అమాయక యువతను చూస్తుంటే బాధగా ఉంది. ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలు, క్రికెట్ బ్యాట్‌లు పట్టుకోవాల్సిన వారికి రాళ్లు ఇస్తున్నారు. భూలోక స్వర్గమైన కశ్మీర్‌లో శాంతి, సామరస్యాలు కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. కొందరు దాన్ని జీర్ణించుకోలేక యువతను విధ్వంస మార్గం వైపు పురిగొల్పుతున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం నుంచి కశ్మీరీ సోదర సోదరీమణులకు ఒకటి చెప్పాలనుకుంటున్నా.. మన స్వాతంత్య్ర సమరయోధులు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇచ్చినట్లే కశ్మీర్‌కూ అదే అధికారం ఇచ్చారు. అమాయక యువత రాళ్లు పట్టుకోవడం చూసి బాధగా ఉంది. కొందరి రాజకీయాలు విజయవంతం కావచ్చు. కానీ అమాయక యువత భవిష్యత్తు ఏం కావాలి?’ అని ఉద్వేగంగా మాట్లాడారు.
దేశం కోసం ప్రాణమిచ్చే కశ్మీరీలకు కరువు లేదు
‘కొందరి హానికర ఆలోచనల నడుమ అమర్‌నాథ్ యాత్రకు రక్షణ కల్పించినందుకు కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి అభినందనలు తెలుపుతున్నా. భారత్, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలతో పాటు 125 కోట్ల మంది ప్రజలు మీరు బాగుండాలని కోరుతున్నారు. వారు మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. మీ అభివృద్ధి కోసం భారత్ ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేందుకు మేం సిద్ధం. కశ్మీర్‌లో దేశం కోసం ప్రాణాలు అర్పించే వారికి కరువు లేదు. జాతి నిర్మాణం కోసం చేతులు కలపండి’ అని మోదీ సూచించారు. మావోయిస్టులు, తీవ్రవాదులు ఆయుధాల్ని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. వారు ఎన్నో కోల్పోయారని, అయితే హింస వారికేమిచ్చిందో సమీక్షించుకోవాలన్నారు.
క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ‘70 సాల్ ఆజాదీ-జర యాద్ కరో కుర్బానీ’(70 ఏళ్ల స్వాతంత్య్రం- నాటి త్యాగాలు స్మరించుకుందాం) కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పురా జిల్లా భాబ్రాలో మంగళవారం ప్రధాని ప్రారంభించారు. ఆజాద్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భద్రతా ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి కాన్వాయ్‌ను ఆపి స్థానిక బోహ్రా ప్రజలతో మోదీ కరచాలనం చేశారు.
నివేదిక ఇవ్వండి: సుప్రీం
శ్రీనగర్‌లో గతనెల 10న షబీర్ అహ్మద్ మిర్(26)ను పోలీసులు చంపారన్న ఆరోపణలపై నివేదిక సమర్పించాలని జమ్మూకశ్మీర్ పోలీసుల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
గళమెత్తక తప్పని పరిస్థితి: పాక్
ఇస్లామాబాద్: కశ్మీరీలు అణచివేతకు గురయ్యారని, వారి తరఫున తాను గళమెత్తక తప్పని పరిస్థితి నెలకొందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కశ్మీర్ లోయలో ప్రజల దుస్థితిని ప్రపంచం అర్థం చేసుకునేలా చేయటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తానన్నారు.
కశ్మీర్‌కు ఏం కావాలన్నా చేస్తాం..
‘కశ్మీర్‌ను భూతల స్వర్గంలా కొనసాగేలా పరిరక్షించాలి. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ఒకే మాట వినిపించడాన్ని అభినందిస్తున్నా. అది భారత్ బలం, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కేంద్రంతో కలసి రాష్ట్ర ప్రభుత్వం కశ్మీర్ అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ విషయంలో మా ప్రభుత్వం ఏం కావాలన్నా చేస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, పర్యాటకంపై ఆధారపడ్డవారి, యాపిల్ పెంపకందారుల అభ్యున్నతికి సాయపడతాం.
దేశ ప్రజలకు కశ్మీర్ స్వర్గంలాంటిది. ఒక్కసారైనా ప్రతీ భారతీయుడు అక్కడికి వెళ్లాలని కోరుకుంటాడు. కానీ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ.. ఈ గొప్ప సంస్కృతికి చేటు చేస్తున్నారు. కశ్మీర్‌లోని ప్రతీ సామాన్యుడు శాంతిని కోరుకుంటున్నాడు. అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. పంచాయతీల్ని బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు.