Kashmir Violence
-
కశ్మీర్‌పై కలిసికట్టుగా సాగుదాం
రాజ్యాంగానికి లోబడి చర్చలు కొనసాగాలి * కశ్మీర్ ప్రతిపక్షాల ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ * పెల్లెట్ గన్స్‌పై నిషేధం విధించాలి * రాజకీయ పరిష్కారం కనుగొనాలని పార్టీల విజ్ఞప్తి న్యూఢిల్లీ: కశ్మీర్లో కొనసాగుతున్న హింసపై ప్రధాని మోదీ సోమవారం తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందంతో భేటీతో మోదీ మాట్లాడారు. 75 నిముషాల పాటు సాగిన భేటీలో కశ్మీర్లో తాజా పరిస్థితి, పరిష్కారాలపై చర్చించారు. కశ్మీర్లో కొనసాగుతున్న సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలంటూ ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ‘భేటీలో ప్రతిపక్షాల పార్టీల నేతలు నిర్మాణాత్మక సూచనలు చేయడాన్ని అభినందిస్తున్నా. మా ప్రభుత్వం కశ్మీర్ రాష్ట్రం, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కశ్మీర్ లోయలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. సమస్య పరిష్కారానికి రాజ్యాంగ పరిధికి లోబడి చర్చలు జరపాల్సిన అవసరముంది. ఇటీవలి ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు మనలో ఒకరే. యువత, భద్రతా సిబ్బంది, పోలీసులు ఇలా ఎవరు మరణించినా మనకు బాధ కలుగుతుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రభుత్వం, జాతి మొత్తం అండగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియచేయాలి’ అని ప్రధాని సూచించారంటూ భేటీ అనంతరం పీఎంవో కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పెల్లెట్స్ గన్స్ వాడకంపై నిషేధం విధించాలని బృందం కోరింది. కలిసి పనిచేసేందుకు సిద్ధం: ఒమర్ భేటీ తర్వాత ఒమర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలని మోదీని కోరాం. అప్పుడే కశ్మీర్‌సహా దేశంలో శాంతి నెలకొంటుంది. అభివృద్ధి ఒక్కటే కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదన్న మా అభిప్రాయంతో ప్రధాని ఏకీభవించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో సమస్యను సరిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.. తర్వాత పరిష్కారం దొరుకుతుంది. కశ్మీర్ సమస్యను ప్రధానంగా రాజకీయ కోణంలో నొక్కి చెప్పాం.’ అని చెప్పారు. కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని ఒమర్ ట్వీట్ చేశారు. ‘మాకిచ్చిన సమయం దాటిపోయినా ప్రధాని మేం చెప్పిన విషయాల్ని ఓపికతో విన్నారు.. అలాగే మా విజ్ఞప్తిని అంగీకరించారు’ అంటూ స్పందించారు. కాగా, వరసగా 45వ రోజూ శ్రీనగర్‌లో కర్ఫ్యూ, ఆందోళనలు కొనసాగాయి. ఎవరితో చర్చలు జరపాలి?: కాంగ్రెస్ కశ్మీర్‌పై చర్చలకు ప్రధాని పిలుపును కాంగ్రెస్ తప్పుపట్టింది. ఎవరితో చర్చలు జరపాలో ప్రధాని స్పష్టం చేయలేదని విమర్శించింది. ‘ప్రధాని తరచుగా మాట మారుస్తున్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పారు? స్వాతంత్య్ర వేడుకలో ఏం మాట్లాడారు? ఈ రోజు చర్చల గురించి మాట్లాడుతున్నారు?’ అని ప్రశ్నించింది. ‘అన్నీ ఒట్టి మాటలు, శుష్క వాగ్దానాలే’ అని కాంగ్రెస్ తప్పుబట్టింది. రాజకీయంగానే పరిష్కారం: సుప్రీం న్యూఢిల్లీ: కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలని, అన్ని సమస్యల్ని న్యాయవ్యవస్థ పరిధిలో పరిష్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవాది, జేకెఎన్పీపీ(జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ) నేత భీమ్ సింగ్ పిటిషన్‌పై సోమవారం స్పందిస్తూ... కశ్మీర్ అంశంలో వివిధ కోణాలు ఇమిడి ఉన్నాయని, అందుకే రాజకీయంగానే పరిష్కారం కనుగొనాలని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్ల ధర్మాసనం సూచించింది. ప్రధానిని కలవకుండా ఆర్ఎస్ఎస్ అడ్డుకుందన్న భీమ్ సింగ్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... మోదీని కలుసుకునేందుకు సాయపడాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీం సూచించింది. రాజకీయ ప్రకటనలు చేయవద్దని, ప్రధానిని కలిసిన కశ్మీర్ ప్రతిపక్ష నేతల బృందంతో కలవాలంటూ సింగ్‌కు చెప్పింది. జమ్మూ కశ్మీర్లో గవర్నర్ పాలన విధించడంతో పాటు వివిధ అంశాల్ని పిటిషన్లో ప్రస్తావించారు. కశ్మీర్‌లోని తాజా పరిస్థితిపై కేంద్రం సమర్పించిన నివేదికకు సమాధానమివ్వాలంటూ సింగ్‌ను సుప్రీం ఆదేశించింది. -
చనిపోయిన వాళ్లు కూడా మనవారే!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతిపక్ష నాయకుల బృందం సోమవారం ప్రధాని మోదీతో సమావేశమైంది. కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేతల బృందం ఈ సమావేశంలో వివరించింది. ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ 'కశ్మీర్లో తాజా ఉద్రిక్తతల వల్ల చనిపోయిన వారు కూడా మనవారే. వారు యువత కానివ్వండి, పోలీసులు, లేదా భద్రతా దళాలు కానివ్వండి. వారంతా మనలో భాగమే. వారి మరణాలు మనల్ని కలిచివేస్తున్నాయి' అని ప్రతిపక్ష నేతలతో పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యకు రాజ్యాంగ పరిధిలో చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం సాధించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల్లో దాదాపు 70మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. -
కశ్మీర్‌పై మౌనం వీడిన మోదీ!
-
చర్చలతో శాంతి సాధ్యం!
-
చర్చలతో శాంతి సాధ్యం!
కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ ≈ పుస్తకాలు, ల్యాప్‌టాప్‌ల స్థానంలో రాళ్లా? ≈ కశ్మీర్ యువతను తప్పుదారి పట్టిస్తున్నారు.. ≈ మానవత్వం, ప్రజాస్వామ్యం, కశ్మీరియత్ స్ఫూర్తితో చర్చలు ≈ కశ్మీర్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి ≈ ‘70 సాల్ ఆజాదీ-యాద్ కరో కుర్బానీ’ ప్రారంభోత్సవంలో మోదీ భాబ్రా: నెల రోజులుగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో కొనసాగుతున్న హింసా కాండపై ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు మౌనం వీడారు. ఇన్సానియత్(మానవత్వం), జమ్హూ రియత్(ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ స్ఫూర్తితో కశ్మీర్లో శాంతి నెలకొల్పేందుకు ప్రజాస్వామ్య మార్గం, చర్చలు ఉన్నాయని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలమైన మధ్యప్రదేశ్‌లోని భాబ్రాలో మాట్లాడుతూ..‘వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్ విధానాన్ని అనుసరించారు. మేం కూడా అదే బాటలో పయనిస్తున్నాం. మానవత్వం, కశ్మీరియత్ దెబ్బతినేందుకు అనుమతించకూడదు. మిగతా భారతీయులకున్నట్లే కశ్మీర్ ప్రజలకు అదే స్వేచ్ఛ ఉంది’ అని చెప్పారు. యువతను పురిగొల్పుతున్నారు ‘అమాయక యువతను చూస్తుంటే బాధగా ఉంది. ల్యాప్‌టాప్‌లు, పుస్తకాలు, క్రికెట్ బ్యాట్లు పట్టుకోవాల్సిన వారికి రాళ్లు ఇస్తున్నారు. భూలోక స్వర్గమైన కశ్మీర్లో శాంతి, సామరస్యాలు కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. కొందరు దాన్ని జీర్ణించుకోలేక యువతను విధ్వంస మార్గం వైపు పురిగొల్పుతున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలం నుంచి కశ్మీరీ సోదర సోదరీమణులకు ఒకటి చెప్పాలనుకుంటున్నా.. మన స్వాతంత్య్ర సమరయోధులు దేశంలోని ఇతర ప్రాంతాలకు ఇచ్చినట్లే కశ్మీర్‌కూ అదే అధికారం ఇచ్చారు. అమాయక యువత రాళ్లు పట్టుకోవడం చూసి బాధగా ఉంది. కొందరి రాజకీయాలు విజయవంతం కావచ్చు. కానీ అమాయక యువత భవిష్యత్తు ఏం కావాలి?’ అని ఉద్వేగంగా మాట్లాడారు. దేశం కోసం ప్రాణమిచ్చే కశ్మీరీలకు కరువు లేదు ‘కొందరి హానికర ఆలోచనల నడుమ అమర్నాథ్ యాత్రకు రక్షణ కల్పించినందుకు కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీకి అభినందనలు తెలుపుతున్నా. భారత్, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలతో పాటు 125 కోట్ల మంది ప్రజలు మీరు బాగుండాలని కోరుతున్నారు. వారు మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. మీ అభివృద్ధి కోసం భారత్ ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చేందుకు మేం సిద్ధం. కశ్మీర్లో దేశం కోసం ప్రాణాలు అర్పించే వారికి కరువు లేదు. జాతి నిర్మాణం కోసం చేతులు కలపండి’ అని మోదీ సూచించారు. మావోయిస్టులు, తీవ్రవాదులు ఆయుధాల్ని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. వారు ఎన్నో కోల్పోయారని, అయితే హింస వారికేమిచ్చిందో సమీక్షించుకోవాలన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ‘70 సాల్ ఆజాదీ-జర యాద్ కరో కుర్బానీ’(70 ఏళ్ల స్వాతంత్య్రం- నాటి త్యాగాలు స్మరించుకుందాం) కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పురా జిల్లా భాబ్రాలో మంగళవారం ప్రధాని ప్రారంభించారు. ఆజాద్ విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భద్రతా ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి కాన్వాయ్‌ను ఆపి స్థానిక బోహ్రా ప్రజలతో మోదీ కరచాలనం చేశారు. నివేదిక ఇవ్వండి: సుప్రీం శ్రీనగర్‌లో గతనెల 10న షబీర్ అహ్మద్ మిర్(26)ను పోలీసులు చంపారన్న ఆరోపణలపై నివేదిక సమర్పించాలని జమ్మూకశ్మీర్ పోలీసుల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. గళమెత్తక తప్పని పరిస్థితి: పాక్ ఇస్లామాబాద్: కశ్మీరీలు అణచివేతకు గురయ్యారని, వారి తరఫున తాను గళమెత్తక తప్పని పరిస్థితి నెలకొందని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ కశ్మీర్ లోయలో ప్రజల దుస్థితిని ప్రపంచం అర్థం చేసుకునేలా చేయటానికి అన్ని ప్రయత్నాలూ చేస్తానన్నారు. కశ్మీర్‌కు ఏం కావాలన్నా చేస్తాం.. ‘కశ్మీర్‌ను భూతల స్వర్గంలా కొనసాగేలా పరిరక్షించాలి. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్‌తో సహా అన్ని పార్టీలు ఒకే మాట వినిపించడాన్ని అభినందిస్తున్నా. అది భారత్ బలం, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కేంద్రంతో కలసి రాష్ట్ర ప్రభుత్వం కశ్మీర్ అభివృద్ధికి కృషిచేస్తోంది. ఈ విషయంలో మా ప్రభుత్వం ఏం కావాలన్నా చేస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, పర్యాటకంపై ఆధారపడ్డవారి, యాపిల్ పెంపకందారుల అభ్యున్నతికి సాయపడతాం. దేశ ప్రజలకు కశ్మీర్ స్వర్గంలాంటిది. ఒక్కసారైనా ప్రతీ భారతీయుడు అక్కడికి వెళ్లాలని కోరుకుంటాడు. కానీ కొందరు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ.. ఈ గొప్ప సంస్కృతికి చేటు చేస్తున్నారు. కశ్మీర్‌లోని ప్రతీ సామాన్యుడు శాంతిని కోరుకుంటున్నాడు. అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోంది. పంచాయతీల్ని బలోపేతం చేయడంతో పాటు, యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది’ అని మోదీ పేర్కొన్నారు. -
కశ్మీర్‌పై మౌనం వీడిన మోదీ!
గత నెలరోజులుగా అట్టుడుకుతున్న కశ్మీర్ లోయ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడారు. కశ్మీర్లో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. కొందరు తప్పుదోవ పట్టిన వ్యక్తులు కశ్మీర్ గొప్ప సంస్కృతిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కశ్మీర్ లోయలో గత నెలరోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 56మంది చనిపోగా.. రెండువేలమంది గాయపడ్డ సంగతి తెలిసిందే. మంగళవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కశ్మీర్ అంశంపై స్పందించారు. ఆ రాష్ట్రంలో అశాంతిని దూరంచేసి.. సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి ద్వారా కశ్మీర్‌లోని అన్ని సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. 'కశ్మీర్ శాంతి కోరుతోంది. కశ్మీర్ పౌరుడు పర్యాటకం ద్వారా డబ్బు సంపాదించాలని భావిస్తున్నాడు' అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉన్న స్వేచ్ఛ కశ్మీర్ పౌరుడికి కూడా ఉందని, కశ్మీర్ యువతకు ఉజ్వలమైన భవితను అందించాలని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఆందోళనలు, హింసతో సతమతమవుతున్న కశ్మీర్ విషయమై జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తి సోమవారం కోరిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ మేరకు స్పందించారు. -
కశ్మీర్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
-
కాశ్మీర్ అల్లర్లలో జవాన్లకు గాయలు
-
కశ్మీర్ టైమ్స్
-
కశ్మీర్ హింసపై సోనియా ఆందోళన
న్యూఢిల్లీ: కశ్మీర్ లో జరిగిన హింస్మాతక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశభద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై ఉక్కు మోపాలని సూచించారు. రాజకీయ ప్రక్రియతోనే కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాల్లో రాజకీయ ప్రక్రియ కారణంగా కశ్మీర్ కు ఎన్నో ప్రయోజనాలు దక్కాయన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని భద్రతా దళాలు హతమార్చడంతో కశ్మీర్ లో కల్లోలం చెలరేగింది. హింసాత్మక ఘటనల్లో 23 మంది మృతి చెందగా, 200 మందిపైగా గాయపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.