
చనిపోయిన వాళ్లు కూడా మనవారే!
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రతిపక్ష నాయకుల బృందం సోమవారం ప్రధాని మోదీతో సమావేశమైంది. కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేతల బృందం ఈ సమావేశంలో వివరించింది.
ఈ సందర్భంగా మోదీ స్పందిస్తూ 'కశ్మీర్‌లో తాజా ఉద్రిక్తతల వల్ల చనిపోయిన వారు కూడా మనవారే. వారు యువత కానివ్వండి, పోలీసులు, లేదా భద్రతా దళాలు కానివ్వండి. వారంతా మనలో భాగమే. వారి మరణాలు మనల్ని కలిచివేస్తున్నాయి' అని ప్రతిపక్ష నేతలతో పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యకు రాజ్యాంగ పరిధిలో చర్చల ద్వారా శాశ్వత పరిష్కారం సాధించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ తర్వాత కశ్మీర్ లోయలో నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల్లో దాదాపు 70మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.