
కశ్మీర్‌పై కలిసికట్టుగా సాగుదాం
కశ్మీర్‌లో కొనసాగుతున్న హింసపై ప్రధాని మోదీ సోమవారం తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగానికి లోబడి చర్చలు కొనసాగాలి
* కశ్మీర్ ప్రతిపక్షాల ప్రతినిధి బృందంతో ప్రధాని మోదీ
* పెల్లెట్ గన్స్‌పై నిషేధం విధించాలి
* రాజకీయ పరిష్కారం కనుగొనాలని పార్టీల విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో కొనసాగుతున్న హింసపై ప్రధాని మోదీ సోమవారం తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ప్రతినిధి బృందంతో భేటీతో మోదీ మాట్లాడారు. 75 నిముషాల పాటు సాగిన భేటీలో కశ్మీర్‌లో తాజా పరిస్థితి, పరిష్కారాలపై చర్చించారు.
కశ్మీర్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలంటూ ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ‘భేటీలో ప్రతిపక్షాల పార్టీల నేతలు నిర్మాణాత్మక సూచనలు చేయడాన్ని అభినందిస్తున్నా. మా ప్రభుత్వం కశ్మీర్ రాష్ట్రం, ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంది. కశ్మీర్ లోయలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. సమస్య పరిష్కారానికి రాజ్యాంగ పరిధికి లోబడి చర్చలు జరపాల్సిన అవసరముంది.
ఇటీవలి ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన వారు మనలో ఒకరే. యువత, భద్రతా సిబ్బంది, పోలీసులు ఇలా ఎవరు మరణించినా మనకు బాధ కలుగుతుంది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రభుత్వం, జాతి మొత్తం అండగా ఉంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లి ఈ విషయాన్ని తెలియచేయాలి’ అని ప్రధాని సూచించారంటూ భేటీ అనంతరం పీఎంవో కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పెల్లెట్స్ గన్స్ వాడకంపై నిషేధం విధించాలని బృందం కోరింది.
కలిసి పనిచేసేందుకు సిద్ధం: ఒమర్
భేటీ తర్వాత ఒమర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అంశానికి రాజకీయ పరిష్కారం కనుగొనాలని మోదీని కోరాం. అప్పుడే కశ్మీర్‌సహా దేశంలో శాంతి నెలకొంటుంది. అభివృద్ధి ఒక్కటే కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదన్న మా అభిప్రాయంతో ప్రధాని ఏకీభవించారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో సమస్యను సరిగా అర్థం చేసుకోవడం ముఖ్యం.. తర్వాత పరిష్కారం దొరుకుతుంది. కశ్మీర్ సమస్యను ప్రధానంగా రాజకీయ కోణంలో నొక్కి చెప్పాం.’ అని చెప్పారు. కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని ఒమర్ ట్వీట్ చేశారు. ‘మాకిచ్చిన సమయం దాటిపోయినా ప్రధాని మేం చెప్పిన విషయాల్ని ఓపికతో విన్నారు.. అలాగే మా విజ్ఞప్తిని అంగీకరించారు’ అంటూ స్పందించారు. కాగా, వరసగా 45వ రోజూ శ్రీనగర్‌లో కర్ఫ్యూ, ఆందోళనలు కొనసాగాయి.
ఎవరితో చర్చలు జరపాలి?: కాంగ్రెస్
కశ్మీర్‌పై చర్చలకు ప్రధాని పిలుపును కాంగ్రెస్ తప్పుపట్టింది. ఎవరితో చర్చలు జరపాలో ప్రధాని స్పష్టం చేయలేదని విమర్శించింది. ‘ప్రధాని తరచుగా మాట మారుస్తున్నారు. అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పారు? స్వాతంత్య్ర వేడుకలో ఏం మాట్లాడారు? ఈ రోజు చర్చల గురించి మాట్లాడుతున్నారు?’ అని ప్రశ్నించింది. ‘అన్నీ ఒట్టి మాటలు, శుష్క వాగ్దానాలే’ అని కాంగ్రెస్ తప్పుబట్టింది.
రాజకీయంగానే పరిష్కారం: సుప్రీం
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితిని రాజకీయంగానే పరిష్కరించాలని, అన్ని సమస్యల్ని న్యాయవ్యవస్థ పరిధిలో పరిష్కరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవాది, జేకెఎన్‌పీపీ(జమ్మూ కశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ) నేత భీమ్ సింగ్ పిటిషన్‌పై సోమవారం స్పందిస్తూ... కశ్మీర్ అంశంలో వివిధ కోణాలు ఇమిడి ఉన్నాయని, అందుకే రాజకీయంగానే పరిష్కారం కనుగొనాలని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఏఎం ఖాన్‌విల్కర్, జస్టిస్ డీవై చంద్ర చూడ్‌ల ధర్మాసనం సూచించింది.
ప్రధానిని కలవకుండా ఆర్‌ఎస్‌ఎస్ అడ్డుకుందన్న భీమ్ సింగ్ ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... మోదీని కలుసుకునేందుకు సాయపడాలని సొలిసిటర్ జనరల్‌కు సుప్రీం సూచించింది. రాజకీయ ప్రకటనలు చేయవద్దని, ప్రధానిని కలిసిన కశ్మీర్ ప్రతిపక్ష నేతల బృందంతో కలవాలంటూ సింగ్‌కు చెప్పింది. జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించడంతో పాటు వివిధ అంశాల్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. కశ్మీర్‌లోని తాజా పరిస్థితిపై కేంద్రం సమర్పించిన నివేదికకు సమాధానమివ్వాలంటూ సింగ్‌ను సుప్రీం ఆదేశించింది.