కశ్మీర్‌పై మౌనం వీడిన మోదీ!
గత నెలరోజులుగా అట్టుడుకుతున్న కశ్మీర్ లోయ విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడారు. కశ్మీర్‌లో శాంతి, సామరస్యాలను పునరుద్ధరించేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. కొందరు తప్పుదోవ పట్టిన వ్యక్తులు కశ్మీర్ గొప్ప సంస్కృతిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వని భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో కశ్మీర్ లోయలో గత నెలరోజులుగా కొనసాగుతున్న ఆందోళనల్లో 56మంది చనిపోగా.. రెండువేలమంది గాయపడ్డ సంగతి తెలిసిందే.
మంగళవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కశ్మీర్ అంశంపై స్పందించారు. ఆ రాష్ట్రంలో అశాంతిని దూరంచేసి.. సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధమని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అభివృద్ధి ద్వారా కశ్మీర్‌లోని అన్ని సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.
'కశ్మీర్ శాంతి కోరుతోంది. కశ్మీర్ పౌరుడు పర్యాటకం ద్వారా డబ్బు సంపాదించాలని భావిస్తున్నాడు' అని ప్రధాని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉన్న స్వేచ్ఛ కశ్మీర్ పౌరుడికి కూడా ఉందని, కశ్మీర్ యువతకు ఉజ్వలమైన భవితను అందించాలని తాము భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఆందోళనలు, హింసతో సతమతమవుతున్న కశ్మీర్ విషయమై జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తి సోమవారం కోరిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ మేరకు స్పందించారు.