కోల్‌కత్తా : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం ఆంక్షల నుంచి మద్యం షాపులకు వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీంతో వైన్‌షాపుల ముందు మందుబాబులు బారులు తీరుతున్నారు. దాదాపు 45 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం మద్యం రేట్లను విపరీతంగా పెంచుతున్నాయి. తాజాగా మద్యం ధరలపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యం ధరలను ఏకంగా 30శాతం పెంచుతూ మమత సర్కార్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా పెరిగిన రేట్లు తక్షణమే అమల్లోకి వచ్చేలా జీవో జారీ చేసింది. షాపుల వద్ద రద్దీని తగ్గించేందుకు రేట్లు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. (మద్యం ధరలు మార్గదర్శకాలు)
మద్యం ధరలపై బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలని పలు రాష్ట్రాలు సైతం భావిస్తున్నాయి. కాగా ఆర్థిక వ్యవస్థను సంక్షోభం నుంచి గట్టెక్కించడం కోసం మద్యం దుకాణాలకు కేంద్రం షరతులతో కూడిన అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఇక మద్యం షాపులు తెరవడంతో ఛత్తీస్‌గడ్, బెంగళూరు, ఢిల్లీ ప్రాంతాల్లో కిలోమీటర్ల పొడవునా మద్యం ప్రియులు బారులు తీరారు. ఇక ఏపీలోనూ మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను 25% పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు సర్‌ఛార్జి కింద ఈ ధరలను పెంచనున్నారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి దుకాణాల వద్ద రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. (వైన్‌షాపుల ఎదుట మద్యం ప్రియుల జాతర)
Comments
Please login to add a commentAdd a comment