మాల్యాను వదిలేసి.. మమ్మల్ని చితకబాదుతారా!
తంజావూరు: బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగనామం పెట్టి.. బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా విదేశాల్లో యథేచ్ఛగా విహరిస్తున్నాడు. విదేశాలకు వెళ్లకుండా సీబీఐ విమానాశ్రయాల్లో లూకౌట్ నోటీసులు జారీచేసినా.. ఆయన గుట్టుచప్పుడు కాకుండా దేశం వదిలి పరారయ్యాడు. దాదాపు రూ. 9వేల కోట్లు ఎగ్గొట్టిన అలాంటి వ్యక్తిని యథేచ్ఛగా వదిలేసిన బ్యాంకు అధికారులు, పోలీసులు తమిళనాడులో ఓ అమాయక రైతును చితకబాదారు. అతడు చేసిన నేరమల్లా.. బ్యాంకు నుంచి తీసుకున్న అప్పులో రూ. 1.30 లక్షలు తిరిగి చెల్లించకపోవడమే.
తంజావూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ అమానుష ఘటనను ఓ ప్రత్యక్ష సాక్షి వీడియో తీసి ఆన్‌లైన్‌లో పెట్టాడు. జీ బాలన్ అనే రైతు బ్యాంకు నుంచి రూ. 3.4 లక్షలు అప్పు తీసుకొని ఓ ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఇప్పటివరకు ఈ అప్పు, దాని మీద వడ్డీ కింద రూ. 4.1 లక్షల వరకు బ్యాంకుకు కట్టాడు. కరువు కారణంగా ఈసారి పంట సరిగ్గా పండకపోవడంతో రెండు నెలల వాయిదాలు కట్టలేకపోయాడు. దీంతో బ్యాంకు అధికారి వెంట వచ్చిన పోలీసులు 40 ఏళ్ల ఆ బక్క రైతును చితకబాది.. అతని ట్రాక్టర్‌ను లాక్కొని వెళ్లారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ రైతు భార్య విజయ్ మాల్యా అంశాన్ని ప్రస్తావించింది. 'వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మల్యాను యథేచ్ఛగా వదిలిపెట్టి.. మా పేద రైతులను మాత్రం వేధిస్తున్నారు' అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
కాలం కలిసిరాక పంటలు పండక రుణవాయిదాలు చెల్లించలేకపోయానని బాలన్ ఎంత వేడుకున్నా.. పోలీసులు కనికరించలేదు. ఆయన నుంచి ట్రాక్టర్ ను బలవంతంగా స్వాధీనం చేసుకొని వెళ్లిపోయారు. దీంతో చేతికొచ్చిన చెరుకు పంటను స్థానిక మార్కెట్ కు ఎలా తీసుకెళ్లాలో తెలియక బాలన్ మథనపడుతున్నారు. అయితే స్థానిక ఐజీ సెంథమరై కన్నన్ మాత్రం తాము కోర్టు ఆదేశాలను మాత్రమే అమలుచేశామని, ఆ రైతు నుంచి ట్రాక్టర్ స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిందని విలేకరులకు తెలిపారు.