
‘తల నరికేస్తాను’.. అదేమన్న తప్పా?
యోగా గురువు రాందేవ్ బాబా తన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను అన్నదాంట్లో తప్పేముందంటూ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: యోగా గురువు రాందేవ్ బాబా తన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను అన్నదాంట్లో తప్పేముందంటూ వ్యాఖ్యానించారు. పైగా తనకు ఏ కోర్టు నుంచి సమన్లుగానీ, వారెంట్‌గానీ రాలేదంటూ ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో హర్యాణాలోని రోహతక్ జిల్లాలో ఓ ర్యాలీలో పాల్గొన్న బాబా రాందేవ్ ‘ఎవరైతే భారత్ మాతాకీ జై’ అనే నినాదాన్ని అనడానికి నిరాకరిస్తారో వారి తల నరికేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి గత బుధవారం రోహతక్ కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అంతకు రెండు రోజుల ముందు కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలంటూ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. అయితే, ఆయన కోర్టుకు హాజరకాకపోవడంతో బుధవారం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. దీనిపై ఆయనను ఓ మీడియా ఇంటర్వ్యూ చేయగా..‘నేనేం తప్పుగా అన్నాను? నేను చట్టాన్ని నమ్ముతాను.. ఈ విషయం ఇంతటితో ముగిసింది. ఇప్పటి వరకు నాకు ఎలాంటి సమన్లు, వారెంట్‌లు రాలేదు. ఇలాంటి విషయాలు అసలు మీకు ఎలా తెలుస్తాయో నాకు అర్ధం కావడం లేదు’ అని ఆయన అన్నారు.