చికెన్ ముక్కలు లెక్కగట్టి పెడతారట
న్యూఢిల్లీ: రెస్టారెంట్లు, హోటళ్లలో వృథా అయ్యే ఆహారాన్ని సేవ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. ఆహార రంగానికి చెందిన ముఖ్యులతో ఈ మేరకు సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర ఆహార, వినియోగదారుల శాఖ మంత్రి రామ్ విలాస్ పశ్వాన్ మీడియాతో పేర్కొన్నారు. రెస్టారెంట్లు, హోటళ్లకు వచ్చే వారికి ఒక్కో ప్లేటుకు ఎంత ఆహారం వడ్డించాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు చెప్పారు.
తాను రెస్టారెంట్లకు వెళ్లిన సమయంలో ఆహారం వృథా కావడం గమనించినట్లు తెలిపారు. అధిక సంఖ్యలో పేదలు కలిగిన భారత్ లాంటి దేశంలో ఆహారం వృథాగా పోవడం మంచిది కాదన్నారు. రెస్టారెంట్లకు వచ్చే వారికి వడ్డించే ఆహారంపై చట్టపరమైన నిబంధనలు తెచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
ఆహారంపై ఆంక్షలు వేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని.. ఇంట్రెస్ట్ ఆఫ్ కన్‌జ్యూమర్స్ ఉన్నందు వల్లే ఈ దిశలో యోచిస్తున్నట్లు తెలిపారు. రెస్టారెంట్లు, హోటళ్లు అన్నింటిలో ఒకే విధమైన రూల్స్‌ను తెచ్చే విషయంపై ఆహార రంగ నిపుణులతో చర్చలు జరుపుతామని అన్నారు. ఏ ఐటమ్‌ను ఎంత మొత్తంలో సర్వ్ చేస్తారనే విషయాన్ని రెస్టారెంట్లు, హోటళ్లు రాతపూర్వకంగా సమర్పించాల్సివుంటుందని తెలిపారు.
అయితే, ఒక వ్యక్తి ఎంత ఆహారం తీసుకోగలడు అనే దాన్ని అంచనా వేసి ఆ మేరకు నిబంధనలు తయారు చేస్తామని చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఎన్ని చికెన్ ముక్కలు తినగలడు అనే దాన్ని అంచనా వేసి అన్ని చికెన్ పీస్‌లు లెక్కగట్టి పెడతారనమాట. కాగా ధాబాల్లో మాత్రం ఈ నిబంధనలు వర్తించబోవని తెలిపారు.