జయ పదవి దక్కేదెవరికి?
సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు తమిళనాడులో అధికార అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే) పార్టీకి అశనిపాతంలా మారింది. జయలలిత సారథ్యంలో 2011లో డీఎంకేను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే.. ఇటీవలి ఎన్నికల్లో సైతం అద్భుత విజయాలు నమోదు చేసింది. రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాల్లో 37 సీట్లు గెలుచుకుంది. తాజా తీర్పుతో.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో 150 స్థానాలు గల అన్నా డీఎంకే ప్రభుత్వానికి ఎటువంటి ఢోకా లేకపోయినా.. పార్టీకి, ప్రభుత్వానికి నాయకత్వ సమస్య ఎదురుకానుంది. తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి జయలలిత వైదొలగక తప్పనిసరి పరిస్థితి తలెత్తడంతో.. ఆ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టాన్సీ భూ ఒప్పందం కేసులో దోషిగా నిర్ధారితురాలైన కారణంగా ముఖ్యమంత్రిగా ఆమె నియామకం చెల్లదంటూ సుప్రీంకోర్టు 2001లో తీర్పు ఇచ్చినపుడు కూడా జయలలిత సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పుడు ఒ.పన్నీర్‌సెల్వంను జయలలిత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఆమె తిరిగి వచ్చి ఆ పదవి చేపట్టే వరకూ ఆయనే సీఎంగా కొనసాగారు. ఇప్పుడు సీఎం పదవి దక్కే చాన్స్ ఉన్న వాళ్లలో.. ప్రస్తుతం జయ కేబినెట్‌లో సీనియర్ మంత్రిగా ఉన్న సెల్వంతో పాటు.. రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, విద్యుత్ మంత్రి ఆర్.విశ్వనాథన్‌ల పేర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి షీలాబాలకృష్ణన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి.