ఉత్తరాఖండ్ పీఠం కొత్తవారికే?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ సీఎంగా ఎవరిని నియమిస్తుందనే దానిపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే నలుగురు మాజీ ముఖ్యమంత్రులు బీజేపీలో చేరి విజయం సాధించటంతో వీరిలో ఒకరికి పగ్గాలు అప్పగిస్తారని చర్చ జరుగుతున్నా.. బీజేపీ అధిష్టానం వేరోలా ఆలోచిస్తోంది. పార్టీ పార్లమెంటరీ బోర్డుదే తుది నిర్ణయం అని చెబుతున్నప్పటికీ.. పార్టీకి విధేయులుగా ఉంటూ కేంద్రం ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళ్లగలరు అనుకునే వారికే పట్టంగట్టనున్నట్లు తెలుస్తోంది. ‘మోడీ హవాతోనే ఉత్తరాఖండ్‌లో బీజేపీ ఘన విజయం సాధించింది.
అందుకే సీఎంగా ఎవరిని ఎంపిక చేసినా.. వారు ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీలను పూర్తిచేసేవారు కావాలి. అందుకే సీనియారిటీ, పాలనా అనుభవంతో సంబంధం లేకుండా సీఎం ఎంపిక జరుగుతుంది’ అని బీజేపీ సీనియర్ నేత (పేరు వెల్లడించేందుకు ఇష్టపడని) వెల్లడించారు. దీనికి తోడు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. ‘గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మందికి పరిచయం లేనివారు, పత్రికల్లో ప్రముఖంగా నిలవని వారు సీఎం అయ్యే వీలుంది’ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో.. తన పర్యవేక్షణలో పనిచేసే ఉత్తమమైన జట్టు (సీఎం, మంత్రులు)ను రాష్ట్రానికి ఇస్తానని తెలిపారు.