పట్టణాల్లో బీజేపీ, పల్లెల్లో కాంగ్రెస్!
ఉత్తరాఖండ్ ఎన్నికల సరళి బీజేపీకి స్వల్ప ఆధిక్యం!
డెహ్రాడూన్ నుంచి కె. రామచంద్రమూర్తి: హోరాహోరీగా సాగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో విపక్ష బీజేపీ స్వల్ప ఆధిక్యాన్ని కనబరిచే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ కొంత ఆధిక్యాన్ని సాధించే అవకాశముంది. 2012 ఎన్నికలతో పోలిస్తే తాజా ఎన్నికల్లో అధికంగా నమోదైన 2 శాతం పోలింగ్ కమలదళానికి కలసిరావొచ్చు. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగాను బీజేపీ 30కిపైగా సీట్లు సాధిస్తే అదంతా మోదీ చలవేనని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న గోవా, మణిపూర్‌లు చిన్న రాష్ట్రాలు కావడం, ఉత్తరప్రదేశ్ ఫలితం అనిశ్చితిలో ఉండడం, పంజాబ్‌లో అకాలీ–బీజేపీ కూటమికి విజయావకాశాలు సన్నగిల్లడంతో ఉత్తరాఖండ్ ఒక్కటే బీజేపీకి ఆశాకిరణంగా మారింది. ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రమన్న సంగతిని పట్టించుకోకుండా మోదీ ఏకంగా ఐదు సభల్లో ప్రచారం చేశారు.
పార్టీ అధినేత అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రమంతటా సుడిగాలి ప్రచారం చేశారు. అయితే అంతర్గత కుమ్ములాటలు కాషాయదళాన్ని చీకాకు పెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గోడదూకి వచ్చిన 14 మందికి టికెట్లు ఇవ్వాల్సి రావడంతో చిచ్చు రాజుకుంది. రెబల్స్ పోటీకి దిగడం వీరి విజయానికి ప్రమాదంగా మారింది. బీజేపీ భవితవ్యాన్ని రెండు అంశాలు ప్రధానంగా ప్రభావితం చేసే అవకాశముందని ఓ స్థానిక టీవీ చానల్లో పనిచేసే సీనియర్ పాత్రికేయుడు అవికల్ థాపాలియాల్ చెప్పారు. మొదటి అంశం.. 12 మందికిపైగా రెబల్ అభ్యర్థులు గెలిచే అవకాశం లేకపోయినా వారు బీజేపీ అభ్యర్థుల విజయావకాశాలను భారీగా దెబ్బతీసే అవకాశముంది. బీజేపీ ఈ తిరుగుబాటును ఎలా అధిగమించగలదు? రెండో అంశం.. పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం. క్లీన్ ఇమేజ్ ఉన్న బీసీ ఖండూరీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే పరిస్థితి పార్టీకి అనుకూలంగా మారేది. అయితే 75 ఏళ్లు దాటిన వారిని ఎన్నికల గోదాలో దింపకూడదన్న పార్టీ నియమం ప్రకారం ఖండూరీపై పార్టీ నాయకత్వం మొగ్గుచూపలేదు.
ఒంటరి యోధుడు రావత్..
కాంగ్రెస్ ప్రచారమంతా సీఎం హరీశ్ రావత్ చేతుల మీదుగానే సాగుతోంది. ప్రభుత్వ బాధ్యతలను, పార్టీ బాధ్యతలను ఆయనొక్కడే మోస్తూ బీజేపీకి దీటుగా ప్రచారం చేశారు. గత ఏడాది మార్చిలో ద్రవ్య బిల్లుకు సొంత పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేసినప్పటి నుంచి ఆయన ప్రభుత్వం ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. మొత్తంగా చూస్తే ఆయన రాష్ట్ర ప్రగతి కోసం కొంత శ్రమించారనే చెప్పాలి. అయితే మోదీ ప్రభంజనాన్ని తట్టుకుని నిలవగలరో లేదో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. తమ పార్టీకి 45కు తగ్గకుండా సీట్లొస్తాయని రావత్ డెహ్రాడూన్‌లో ఈ పాత్రికేయుడితో ధీమాగా చెప్పారు. బీజేపీ తరఫున సీఎం రేసులో ఉన్న త్రివేంద్రసింగ్ రావత్ కూడా తమ పార్టీకి 35కుపైగా సీట్లు వస్తాయని అన్నారు.
సీఎం సీటు చుట్టూ ఆ ఆరుగురు
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి ‘సీఎం’ రాజకీయాలు ఆరుగురి చుట్టే తిరుగుతున్నాయి. 2000లో రాష్ట్రం అవతరించినప్పుడు బయటి(హరియాణాలో జన్మించిన) వాడైన నిత్యానంద స్వామి.. వాజ్‌పేయి, అడ్వాణీల ఆశీర్వాదంతో సీఎం అయ్యారు. తర్వాత భగత్ సింగ్ కోషియారీ.. స్వామి ప్రభుత్వాన్ని అస్థిరపరచి తాత్కాలిక సీఎం పగ్గాలు అందుకున్నారు. 2002లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్ రావత్ సారథ్యంలో కాంగ్రెస్ గెలిచింది. అయితే ముఠాకక్షలు ఆయన్ను సీఎం పదవికి దూరం చేశాయి. ఎన్డీ తివారీ ఆ పీఠంపై అధిష్టించారు. రావత్ నుంచి తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటూనే హైకమాండ్ అండతో పూర్తికాలం(2002–2007) పదవిలో కొనసాగారు.
2007లో బీజేపీ విజయంతో సీఎం అయిన బీసీ ఖండూరీకీ స్వపక్షం నుంచి అసమ్మతి సెగ తగలింది. కోషియారి, రమేశ్ పోఖ్రియల్ నిశాంక్‌ల వ్యతిరేకత ఫలితంగా ఖండూరీ 2009లో గద్దె దిగారు. సీఎం పీఠమెక్కిన నిశాంక్ అవినీతి ఆరోపణల ఫలితంగా 2011లో పదవి కోల్పోగా, ఖండూరీ మళ్లీ పగ్గాలు అందుకున్నారు. 2012 ఎన్నికల్లో రావత్ కృషితో కాంగ్రెస్ గెలిచినా అధికారం మాత్రం విజయ్ బహుగుణకు దక్కింది. 2013 నాటి భారీ వరదల తర్వాత పరిస్థితిని చక్కదిద్దడంతో విఫలమయ్యాడంటూ అధిష్టానం ఆయన్ను తప్పించి రావత్‌కు సీఎం పగ్గాలు అప్పగించింది. 2016 మార్చిలో అసెంబ్లీలో ద్రవ్యబిల్లుపై ఓటింగ్ జరగ్గా బహుగుణ వర్గంలోని 9 మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేశారు. రావత్ బలవంతంగా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యే పదవికి రెబల్స్ అనర్హులని సుప్రీం కోర్టు తేల్చడంతో మే నెలలో రావత్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు.