అధికార పార్టీ తుడిచిపెట్టుకుపోయింది!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోరంగా తుడిచిపెట్టుకుపోయింది. సాయంత్రం నాలుగు గంటల వరకు అందించిన కౌంటింగ్ ఫలితాల ప్రకారం 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 34 సీట్లు గెలుపొంది.. మ్యాజిక్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చింది. మరో 23 స్థానాలు ఆ పార్టీ ఆధిక్యంలో ఉండటంతో భారీ మెజారిటీతో బీజేపీ ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు సిద్ధమవుతోంది.
మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఇప్పటివరకు ఆ పార్టీ 10 స్థానాల్లో గెలుపొంది.. 4 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తున్నది. ముఖ్యమంత్రి హరీష్ రావత్ పోటీచేసిన రెండుచోట్లా (హరిద్వార్ రూరల్, కిచ్చా) ఓడిపోవడం కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. దీంతో రావత్ సీఎం పదవికి రాజీనామా చేశారు. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తనదేనని, తన నాయకత్వ లోపం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రావత్ ప్రభుత్వం చాలావరకు వివాదాల్లో కూరుకుపోవడం, కాంగ్రెస్ సర్కారుపై ప్రజావ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోవడంతో ఉత్తరాఖండ్‌లో బీజేపీ సునాయస విజయాన్ని సాధించిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.