అసలు జయలలితకు వారసులెవరు?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి కోసం నేడు ఓ.పన్నీర్‌సెల్వం, శశికళ రెండు వర్గాలుగా చీలిపోవడం సరిగ్గా 30 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ప్రతిబింబిస్తోంది. 1987లో ఎంజీ రామచంద్రన్ చనిపోయినప్పుడు ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్, జయలలిత మధ్య చోటుచేసుకున్న వారసత్వ రాజకీయాలే నేడు పునరావతమవుతున్నాయి. నాడు ఎంజీఆర్ చనిపోయిన రోజు నుంచే వారసత్వ రాజకీయాలకు తెరలేవగా నేడు కాస్త ఆలస్యంగా రాజుకున్నాయి.
ఎంజీఆర్ హయాంలో పార్టీ సైంధాంతిక ప్రాతిపదికగల పార్టీగా కాకుండా ఎంజీఆర్ ఫ్యాన్ క్లబ్‌గానే నడిచింది. జయలలిత హయాంలో కూడా దాదాపుగా అలాగే కొనసాగింది. ఏఐఏడీఎంకేకు సైంధాంతిక ప్రాతిపదిక ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది. పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన వారికే ముఖ్యమంత్రి సీటు దక్కేది. జయలలితకు నిజమైన వారసులెవరనే సమస్య వచ్చేది కాదు. జయలలితకు అత్యంత సన్నిహితంగా ఉన్నందుకు శశికళను ముఖ్యమంత్రి పదవికి ఎన్నుకోవాలా? జయలలిత జైలు కెళ్లినప్పుడల్లా ఆమె పరమ విధేయుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలను మోసినందున పన్నీర్‌సెల్వంను వారుసుడిగా ఎన్నుకోవాలా?
ఇందులో ఏది ప్రజాస్వామ్యం? ఏది అప్రజాస్వామ్యం? ఏఐడీఎంకేకు ఓ సైంధాంతిక ప్రాతిపదిక ఉండి, అది ప్రజాస్వామ్యబద్దంగా పనిచేసి ఉన్నట్లయితే జయలలిత జైలుకెళ్లినప్పుడే ఆమెను పార్టీ బహిష్కరించి ఉండేది. అది పార్టీ పరంగా నిజమైన ప్రజాస్వామ్యం అనిపించుకునేది. వాస్తవానికి జయలలిత ఇంతకాలం ముఖ్యమంత్రిగా, పార్టీ ప్రధాన కార్వదర్శిగా పాలన సాగించిందీ ప్రజాస్వామ్యబద్ధంగా కాదు. ముసుగేసిన నియంత్రత్వం పద్ధతిలో.
అలాంటప్పుడు జయలలిత వారసులు ఎవరన్నది పన్నీర్‌సెల్వం, శశికళ మధ్య ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా ఎలా తేల్చగలరు? వ్యక్తిగత ప్రయోజనాల లాలూచిలోపడే ఎమ్మెల్యేలు ఆకర్షణీయ ఆఫర్లకు లొంగిపోయి ఎన్నుకోవడమే అసలైన ప్రజాస్వామ్య రాజకీయం. లేదంటే ముఖ్యమంత్రి చనిపోయిన సందర్భాల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అది సాధ్యమయ్యే పనికాదు కనుక మొత్తం అసెంబ్లీని సమావేశపరిచి పోటీ పడుతున్న నాయకుల మధ్య రహస్య బ్యాలెట్ నిర్వహించాలి. ఎమ్మెల్యేలతో శిబిరాలను నిర్వహించే సంస్కతికి చెరమగీతం పాడాలి. వ్యక్తులను చూసి కాకుండా, పార్టీలను చూసి ఓటేసే పరిణతి పార్టీలకు, ఓటర్లుకు వచ్చిన నాడే వారసత్వ రాజకీయాలకు తెరపడుతుంది.
–ఓ సెక్యులరిస్ట్ కామెంట్