సర్జికల్ స్ట్రైక్ జరిగిందో లేదో ఎవరికి తెలుసు?
సాక్ష్యాధారాలను మాజీ ప్రధాని, రక్షణ మంత్రికి చూపించాలి: జేసీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అబద్ధాలు చెప్పే నేతలను నమ్మే పరిస్థితి ప్రస్తుతం లేదని, అందువల్ల సర్జికల్ స్ట్ట్రైక్ విషయంలో నేతలు చెబుతున్న మాటలు ఎలా నమ్మాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ దాడులకు చెందిన వాస్తవాలను బహిరంగపరచాలని మాట్లాడే వారందరూ దేశద్రోహులని, సైన్యానికి వ్యతిరేకం అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పరీకర్ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు.
శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. భారతీయులందరికీ సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని, అయితే ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చి విస్మరించిన నాయకుల మాటలను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. దాడుల సాక్ష్యాలను బహిరంగపరచడం సరైంది కానప్పుడు.. మాజీ ప్రధాని, మాజీ రక్షణ మంత్రులకు చూపి వారి ద్వారా ప్రజలకు చెప్పించే ప్రయత్నం చేస్తే అప్పుడు నమ్ముతారని జేసీ వ్యాఖ్యానించారు. కేంద్రంపై ప్రజలకు అనుమానం ఉందని, సర్జికల్ స్ట్రైక్ జరిగిందో లేదో ఎవరికి తెలుసు? అని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.