టీడీపీలో మాట్లాడే స్వేచ్ఛ లేదు: జేసీ
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో రైతుల రుణాలను 20 శాతం చొప్పున ఐదు విడతల్లో మాఫీ చేస్తామని అంటున్నారు. బ్యాంకర్లు ఒత్తిడి చేయకపోతే రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ, కచ్చితంగా అప్పు మొత్తం చెల్లించాలని ఒత్తిడి పెంచితే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు. రైతులోకం రోడ్లు ఎక్కడం ఖాయం’’ అని టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశం జరుగుతుండగా ఆయన శుక్రవారం అసెంబ్లీ లాబీలోకి వచ్చారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత జానారెడ్డి చాంబర్‌లో, ఆ తర్వాత అసెంబ్లీ వెలుపల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘టీడీపీలో మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఎంపీ పదవితో ఏమాత్రం సంతృప్తికరంగా లేను.
ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా లేదు’’ అని నిర్వేదం వ్యక్తంచేశారు. ఏపీలో కానీ, తెలంగాణ లో కానీ ప్రభుత్వాల పనితీరుపై ఏడాదిరన్నర సమయం తర్వాతే కామెంట్ చేయాలని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ ‘పవర్ ఫుల్’గా తయారయ్యారని వ్యాఖ్యానించారు. సీనియర్ అయినా కేంద్ర మంత్రివర్గంలో ఎందుకు అవకాశం రాలేదని అడగ్గా.. ‘‘అది ఇప్పించేవాళ్లు గుర్తించలేదు. అయినా, నేను ఆ కోటరీలో లేను’ అని జేసీ బదులిచ్చారు. ఏపీలో బీజేపీ శిశువుగా ఉందని, అయితే.. వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలకు, మరీ ముఖ్యంగా టీడీపీలోకి రాలేనివారు బీజేపీ గూటికి చేరడం ఖాయమన్నారు.
రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ అనుకోవడం లేదు
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ అని ఎవరూ అనుకోవడం లేద ని, తెచ్చింది మాత్రం టీఆర్‌ఎస్ అని భావిస్తున్నారని జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘నేను చెప్పా కదా..? ఇప్పుడు ఎక్కడున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి అక్కడా రాదు.. ఇక్కడా రాదని చెప్పా’’ అంటూ తనకు ఎదురొచ్చిన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే గీతారెడ్డితో వ్యాఖ్యానించారు. ‘‘అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశాను. అదే జరిగి ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది, జానారెడ్డి సీఎం అయ్యేవాడు’’ అని పేర్కొన్నారు.