మమ్మల్ని కలిపి ఉంటే..
- తెలంగాణలో పరిస్థితి ఇలా ఉండేది కాదు: జేసీ
- లాబీల్లో జానారెడ్డి, ఉత్తమ్‌లతో వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడితే ప్రయోజనం ఏమిటని రాయలసీమకు చెందిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వ్యాఖ్యానించారు. బుధవారం జేసీ కాసేపు అసెంబ్లీ లాబీల్లో హల్‌చల్ చేశారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి తదితరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణతో కలిపి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు. విభజన సమయంలో మేం చెప్పిన సూచనలేవీ మీరు వినలేదాయె.. టీఆర్‌ఎస్‌ను సరిగా ఎదుర్కోవడం లేదు. ప్రతిపక్ష పార్టీగా ఫెయిల్ అయ్యారు.
అసెంబ్లీలో ఏదో మాట్లాడితే ఇçప్పుడు ప్రయోజనం ఏమిటి? చాలా తçప్పులు చేస్తున్నా టీఆర్‌ఎస్‌ను గట్టిగా కొట్టలేకపోతున్నారు. మమ్ములను కలుపేసుకుంటే పరిస్థితి ఇట్లానే ఉండేదా?’’ అని జేసీ వ్యాఖ్యానించారు. అందుకు జానారెడ్డి నవ్వుతూ చర్చను దాటేయడానికి అన్నట్టుగా చాయ్ తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. ‘చాయ్ వద్దూ.. ఏమీ వద్దు. ఇక్కడ చాయ్ తాగితే నాలో ఉన్న పౌరుషం కూడా సచ్చుబడిపోతుంది. మీతో కలసి చాయ్ కూడా తాగను’’ అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతుంటే సభలో ఉంటూ సాధిస్తున్నదేమిటని ఉత్తమ్‌ను జేసీ ప్రశ్నించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎదురుగా పెట్టుకుని సభలో ఉండి సాధిస్తున్నదేమిటని నిలదీశారు. సభను అడ్డుకోవడం కాదు.. మాట్లాడితేనే సస్పెండ్ చేస్తున్నారని ఉత్తమ్ బదులిచ్చారు. జీరో అవర్‌లో మాట్లాడొచ్చు కదా అని రేవంత్‌ను ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేను మంత్రివర్గంలోకి తీసుకోవడం కన్నా అనైతిక, అప్రజాస్వామిక రాజకీయాలు ఏముంటాయి?’’ అని వ్యాఖ్యానించారు.