మమతా బెనర్జీ తలపై రివార్డు ఎందుకు?
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ముమ్మరంగా వదంతులు విహరిస్తున్నాయి. వీటికి సోషల్ మీడియా వేదిక అవుతోంది. ‘మెటియాబ్రజ్‌లో అల్లర్లు చెలరేగుతున్నట్లు ఇప్పుడే అందిన వార్త. సైన్యాన్ని పిలిపించారు.. కిడ్డెర్‌పోర్‌లో కూడా అల్లర్లు మొదలయ్యాయి.. పార్క్ సర్కస్ ప్రాంతంలో ప్రజలు పెద్ద ఎత్తున గుంపులుగా తిరుగుతున్నారు. ఘోరాలు జరగక ముందే ఇళ్లకు తరలిపోండి’ అంటూ గురువారం సోషల్ మీడియాలో వదంతులు ఊపందుకున్నాయి. నగరంలోని ఈ మూడు ప్రాంతాల్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటం గమనార్హం. అసలు ఏమైనా ఉన్నా లేకపోయినా వదంతులకు మాత్రం కొదవ ఉండట్లేదు.
సకాలంలో పోలీసుల స్పందన
సకాలంలో పోలీసు అధికారులు స్పందించడంతో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. ‘నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు జరుగుతున్నట్లు దురుద్దేశంతో కొంతమంది వదంతులు సృష్టిస్తున్నారు. వాటిని నమ్మకండి. నగరంలో ప్రశాంత పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా, ఎలాంటి అశాంతి పరిస్థితులు లేవు. ఉన్నాయంటూ ఎవరైనా వదంతులు వ్యాప్తిచేస్తే వారి గురించి వెంటనే మాకు తెలియజేయండి’ అంటూ పోలీసులు అదే సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేయడంతో ప్రశాంత పరిస్థితులకు భంగం వాటిల్లలేదు. మధ్యాహ్నం ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా, అల్లరి మూక గొడవ చేసింది. రోడ్డును దిగ్భంధించింది. అక్కడ కూడా పోలీసులు సకాలంలో స్పందించడంతో ఏ గొడవ జరగలేదు. ముస్లింలు, హిందూ నాయకులు కూడా జోక్యం చేసుకొని ప్రశాంత పరిస్థితులకు భంగం వాటిల్లకుండా అడ్డుకున్నారు.
ఎందుకీ ఉద్రిక్తతలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తలనరికి తెచ్చినవారికి రూ. 11 లక్షల రివార్డు ఇస్తామని రాష్ట్ర భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) అధ్యక్షుడు యోగేశ్ వివాదాస్పద ప్రకటన చేసిన నేపథ్యంలో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో తీస్తా నది ఒప్పందం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనను మమతా బెనర్జీ తిరస్కరించడం, రాష్ట్రానికి రావాల్సిన 10,459 కోట్ల రూపాయలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదంటూ ఆమె విమర్శించడం, రాష్ట్రపతి పదవికి మోదీకి ఇష్టంలేని ఎల్‌కే అద్వానీ పేరును ఆమె ప్రతిపాదించడం కూడా ఉద్రిక్త పరిస్థితులకు తోడయ్యాయి.
శ్రీనవమి ఉత్సవాలు మున్నెన్నడూ లేవు
కనకదుర్గ పూజకు ప్రాధాన్యమిచ్చే బెంగాల్ రాష్ట్రంలో, ముఖ్యంగా కోల్‌కతాలో గత 300 ఏళ్లలో శ్రీరామనవమి ఉత్సవాలను కోలాహలంగా జరిపిన సందర్భాలు లేవు. ఈసారి కోలాహలంగానే కాదు, కత్తులు, కటార్లు పట్టుకొని నగరంలో ప్రదర్శనలు జరిపారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతున్న బీజేపీ ఆధ్వర్యంలో మొదటిసారి ఇక్కడ నవమి వేడుకలు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తాయి. అందుకే మమతా బెనర్జీ తలపై 11 లక్షల రివార్డును ప్రకటించిన యోగేశ్‌పై ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేదు. జాతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి తల తీయాలంటూ గతంలో పిలుపునిచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌పై కూడా రాష్ట్ర పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదు.
ప్రధానంగా ముస్లిం ఓట్లతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మమతా బెనర్జీ ముస్లిం మత గురువులకు ప్రభుత్వ వేతనాలు కల్పించడం పట్ల కూడా బీజేపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.