ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చేజారి దశాబ్దాలవుతున్నా.. అమెథీ, రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలు మాత్రం గాంధీ-నెహ్రూ వారసుల కంచుకోటలుగా మిగిలాయి. ప్రధానంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న అమేథీలో.. నెహ్రూ రాజకీయ వారసులకు తిరుగులేదు. మొట్టమొదటి లోక్‌సభ ఎన్నికనుంచి 2014 ఎన్నికల వరకూ ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగరేస్తూ వస్తోంది. మధ్యలో కేవలం రెండు సార్లు మాత్రమే జనతాపార్టీ నుంచి రవీంద్ర ప్రతాప్ సింగ్ (1977), భారతీయ జనతాపార్టీ (1998) డాక్టర్ సంజయ్ సింగ్‌లు విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలని భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకూ అమేథీలో గెలుపు సాధిస్తుందా? రాహుల్ గాంధీకి ముచ్చెమటలు పట్టించే అవకాశాలున్నాయా? అమేథీ నియోజకవర్గం గురించి కొన్ని ముఖ్యాంశాలు మీకోసం
- అమేథీ నియోజకవర్గాన్ని 1967లో ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటినుంచి ఈ నియోజకవర్గం నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటలా నిలిచింది. మొత్తం 15 లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండుసార్లు మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ ఓటమి పాలైంది.
- ఎమర్జెన్సీ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మీద వచ్చిన వ్యతిరేకతతో 1977లో ఒకసారి. అటల్ బిహారీ వాజ్‌పేయి మీదున్న సానుభూతితో.. మరోసారి కాంగ్రెస్ ఇక్కడ ఓటమి పాలైంది.
- ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 9 సార్లు నెహ్రూ-గాంధీ వారసులు విజయం సాధించారు.
- ఇక్కడ నుంచి సంజయ్ గాంధీ 1980లో తొలిసారి గెలిచారు. తరువాత రాజీవ్ గాంధీ వరుసగా 1981, 1984, 1989, 1991లో గెలుపొందారు. తరువాత 1999లో సోనియా గాంధీ విజయం సాధించారు. రాహుల్ గాంధీ 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా హ్యాట్రిక్ సాధించారు.
- అమేథీలో నెహ్రూ వారసులు భారీ ఓట్ల తేడాతో గతంలో విజయాలు సాధించారు. ప్రధానంగా.. 1980లో 1.29, 1081లో 2.38, 1984లో 3.15, 1999లో 3 లక్షల ఓట్ల తేడాతో భారీ విజయాలను నమోదు చేశారు.
- గత లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేవలం 1.08 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. నెహ్రూ వారసుల్లో అతి తక్కువ ఓట్లతో విజయం సాధించడం ఇదే ప్రథమం.
- ఇక రాయ్‌బరేలీ విషయానికి వస్తే.. ఇది కూడా కాంగ్రెస్ కంచుకోట అనే చెప్పాలి. 1951లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకూ 19 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో కేవలం 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ ఓటమి పాలైంది.
- ఇక్కడ నుంచి ఫిరోజ్ గాంధీ 1951, 1957 ఎన్నికల్లో విజయం సాధించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 1967, 1971, 1980 ఎన్నికల్లో గెలుపొందారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన అరుణ్ నెహ్రూ వరుసగా 1980, 1984 ఎన్నికల్ల గెలిచారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధినేత్ని సోనియా గాంధీ ఇక్కడ నుంచి 2004, 2006, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు.
- ఉత్తరప్రదేశ్ నుంచి గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు అమేథీ, రాయ్‌బరేలీ మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటిలో దేన్నయినా సాధించాలన్న లక్ష్యంతో భారతీయ జనతాపార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
- అమేథీ, రాయ్‌బరేల్లో ఒక్కసీటును సాధించినా దేశంలో నెహ్రూ-గాంధీ కుటుంబపాలనకు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం చేయవచ్చన్న ఆలోచనలో బీజేపీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment