‘యాత్ర’కు బ్రేక్‌? ఏమిటా నిఘా సమాచారం! | Why Central government decided to curtail the Amarnath yatra | Sakshi
Sakshi News home page

‘యాత్ర’కు బ్రేక్‌? ఏమిటా నిఘా సమాచారం!

Published Sat, Aug 3 2019 1:44 PM | Last Updated on Sat, Aug 3 2019 1:59 PM

Why Central government decided to curtail the Amarnath yatra - Sakshi

కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్‌నాథ్‌ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌కు భారీగా బలగాలనూ తరలించింది. ఒక్కసారిగా లోయలో భయాందోళన రేకెత్తించిన ఈ పరిణామాల వెనుక.. నిఘా వర్గాలు అందించిన కచ్చితమైన సమాచారమే కారణమని తెలుస్తోంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు ఎలాంటి అవాంఛనీయ దాడులకు పాల్పడకుండా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని, సోపూర్‌ ప్రాంతంలో ఐఈడీ (ఇంప్రూవైస్డ్‌ పేలుడు పదార్థాల)లతో భద్రతా బలగాలను జైషే మహమ్మద్‌ (జేఈఎం) తదితర ఉగ్రమూకలు టార్గెట్‌ చేయవచ్చునన్న నిఘా వర్గాల సమాచారమే ఈ ఆకస్మిక పరిణామాలకు కారణమని ఈ వ్యవహారంతో పరిచయం కలిగిన ఇద్దరు విశ్వసనీయ వ్యక్తులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. 

ఏమిటా నిఘా సమాచారం!
జేఈఎం చీఫ్‌ మసూద్‌ అజార్‌ సోదరుడు ఇబ్రహీం అజార్‌ గత నెలలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో కనిపించాడని జాతీయ భద్రతా సంస్థలకు కచ్చితమైన నిఘా సమాచారం అందింది. 1999 నాటి భారత్‌ విమానం హైజాక్‌ ప్రధాన సూత్రధారి అయిన ఇబ్రహీం అజార్‌ తన కొడుకు మృతికి ప్రతీకారంగా లోయలోకి చొరబడి.. ఇక్కడ భద్రతా దళాలపై జరిపే ఉగ్రదాడులకు నేతృత్వం వహించాలని కోరుకుంటున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇబ్రహీం అజార్‌ నేతృత్వంలో సుశిక్షితులైన జేఈఎం ఉగ్రవాదులు బార్డర్‌ యాక‌్షన్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేసి.. సరిహద్దు నియంత్రణ రేఖ మీదుగా ఉన్న పాక్‌ ఆర్మీ పోస్టుల దిశగా కదిలాయని నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఇబ్రహీం కొడుకు ఉస్మాన్‌ హైదర్‌ గత ఏడాది అక్టోబర్‌లో కశ్మీర్‌లోకి చొరబడి.. అదే నెల 30వ తేదీన పుల్వామాలోని అవంతీపురలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. మరో బంధువు, మసూద్‌ అజార్‌ బావమరిది అబ్దుల్‌ రషీద్‌ కొడుకు తహ్లా రషీద్‌ 2017 నవంబర్‌ 6న పుల్వామా కండి అల్గార్‌ వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇబ్రహీం.. తన కొడుకు తరహాలోనే భారత బలగాలపై పోరాడుతూ చనిపోతానని జేఈఎం కేడర్‌కు చెప్పాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇబ్రహీం అజార్‌ కశ్మీర్‌లో పెద్ద ఎత్తున దాడులకు గ్రౌండ్‌వర్క్‌ చేయడంపై కచ్చితమైన సమాచారం అందడంతో కేంద్రం వెంటనే అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుందని ఓ సీనియర్‌ భదత్రాధికారి వెల్లడించారు. పాకిస్థాన్‌కు చెందిన జేఈఎం, లష్కరే తోయిబా తమ ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడాన్ని నిఘా వర్గాలు ఇప్పటికే పసిగట్టాయి. అంతేకాకుండా అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో ఎం24 స్నిపర్‌ రైఫిల్‌, భద్రతా దళాలు లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు దొరకడంతో పొంచి ఉన్న ముప్పును గ్రహించిన కేంద్రం వెంటనే అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేసిం‍దని, దీంతో యాత్రకు రక్షణగా ఉన్న బలగాలు తిరిగి ఉగ్రమూకల ఏరివేత ఆపరేషన్‌కు సన్నద్ధమవుతాయని ఆ అధికారి తెలిపారు.

కశ్మీర్‌లో హింసాత్మక దాడులే లక్ష్యంగా పాక్‌ సాయుధ మూకలు లోయలోకి పెద్ద ఎత్తున చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయని, కశ్మీర్‌లో పలుచోట్ల ఆత్మాహుతి దాడులు నిర్వహించాలని అవి తలపోస్తున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. పెషావర్‌ నుంచి సుశిక్షితులైన జేఈఎం సాయుధ మూక కశ్మీర్‌లోకి చొరబడి.. భారత బలగాలపై మెరుపుదాడులు నిర్వహించాలని, ఉత్తర కశ్మీర్‌లోని సోపూర్‌లో ఐఈడీలతో భద్రతా దళాలను టార్గెట్‌ చేయాలని పథకాన్ని రచించినట్టు పేర్కొన్నాయి. పాక్‌ సైన్యంతోపాటు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి ఉగ్రసంస్థలు కూడా ఈ దాడుల విషయంలో ఆ మూకలకు సహకారం, సమన్వయం అందించనున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement