సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో కరోనా వైరస్ (కోవిడ్–19) బారిన పడి మరణిస్తున్న వారిలో స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని ‘గ్లోబల్ హెల్త్ 50–50 రిసర్చ్ ఇన్షియేటివ్’ మొదట్లో ప్రకటించింది. స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు కనుక సహజంగా మరణాలు కూడా ఎక్కువగా వారివే ఉంటాయన్న వాదన వచ్చింది. పురుషులే ఎక్కువగా కరోనా బారిన పడడానికి సామాజిక కారణాలు ఉన్నాయి. స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా బయట తిరగడం, వారు సామూహికంగా సిగరెట్లు తాగడం, మందు కొట్టడం, స్త్రీలలాగా ఎప్పటికప్పుడు లేదా ఎక్కువ సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోక పోవడం కారణాలు. జూన్ నాలుగవ తేదీ నాటికి అందుబాటులో ఉన్న కరోనా బాధితుల జాబితా నుంచి కరోనా బారిన పడిన ఎంత మంది స్త్రీలలో ఎంత మంది మరణిస్తున్నారో, కరోనా బారిన పడిన పురుషుల్లో ఎంత మంది మరణిస్తున్నారో ? అన్న అంశాన్ని వైద్య నిపుణులు విశ్లేషించగా పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారన్న విషయం సుస్పష్టంగా తేలింది. అన్ని వయస్కుల స్త్రీ, పురుషుల కేసుల్లో కూడా పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. అంటే 30 ఏళ్లు కలిగిన స్త్రీ, పురుషుల్లో, 80 ఏళ్లు కలిగిన స్త్రీ, పురుషుల్లో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. (24 గంటల్లో 10,667 కేసులు.. 380 మరణాలు)
మాస్ట్ కణాలు కారణమే
పురుషుల్లోనే ఎందుకు ఎక్కువగా మరణిస్తున్నారు ? లేదా స్త్రీలే ఎందుకు ఎక్కువగా బతికి బయట పడుతున్నారు ? అందుకు సామాజిక, వైద్య కారణాలతోపాటు ఎక్కువగా లింగ పరంగా శారీరక నిర్మాణ వ్యవస్థలో ఉన్న తేడాలే కారణమని వైద్య పరిశోధనాంశాల ప్రాతిపదికగా స్పష్టమవుతోంది. స్త్రీ, పురుషుల రోగ నిరోధక శక్తిలో మాస్ట్ కణాలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. అంటురోగాలను ఎదుర్కోవడంలో మాస్ట్ కణాలు పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ క్రియాశీలకంగా పనిచేస్తాయి. మహిళలే ఎక్కువగా జలుబు, దగ్గు లాంటి అలర్జీలకు గురవుతుండడం వల్ల వారిలో మాస్ట్ కణాలు క్రియాశీలకంగా మారి ఉండవచ్చు.
సెక్స్ హార్మోన్స్ పాత్ర
స్త్రీ, పురుషుల్లో ఈస్ట్రోజెన్‌తోపాటు టెస్టోస్టెరోన్ అనే రెండు సెక్స్ హార్మోన్స్ ఉంటాయి. స్త్రీలలో ఈస్ట్రోజెన్‌లు ఎక్కువగా ఉంటే పురుషుల్లో టెస్టోస్టెరోన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్స్ ఎక్కువ సంఖ్య కారణంగా స్త్రీలలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. స్త్రీలలో రెండు రకాల ఎక్స్–క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో ఒక క్రోమోజోమ్‌లో రోగ నిరోధక శక్తిని పెంచాల్సిన జన్యువులు స్తబ్దుగా ఉంటాయి. దాంతో మరో కోమోజోమ్‌లోని జన్యువులు మరింత క్రియాశీలకంగా పని చేస్తాయి. అదే పురుషుల్లో ఉండే ఒకే ఒక్క ఎక్స్–క్రోమోజోన్‌లోని జన్యువులకు అంత శక్తి లేదు.
సామాజిక, వైద్య కారణాలు
స్త్రీలకన్నా పురుషులు ఎక్కువగా పాగ తాగడం, మద్యం సేవించడం, జబ్బును నిర్లక్ష్యం చేయడం, తద్వారా తక్షణమే వైద్య సేవలు అందుకోకపోవడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం పురుషల మరణాలకూ కారణం అవుతోంది. స్థూలకాయం, డయాబెటీస్, గుండె జబ్బుల్లో ఉన్న తేడాలు కూడా మరణాల మధ్య తేడాకు కారణం కావచ్చు. అమెరికాలోని ప్రతిష్టాకరమైన ‘నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్’ గత ఐదేళ్లలో జరిపిన పరిశోధనల ఫలితాల ప్రాతిపదికన అమెరికా ప్రొఫెసర్లు కరోనాపై ఈ అభిప్రాయలను వెలిబుచ్చారు. (నిత్యం లక్షకు తక్కువ కాకుండా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment