కరుణకు జయలలిత నెచ్చెలి పరామర్శ
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యం గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత నెచ్చెలి శశికళ వాకబు చేసినట్టు సమాచారం. కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాల్‌ను శశికళ పరామర్శించినట్టు డీఎంకేలో చర్చ సాగుతోంది. డీఎంకే అధినేత ఎం కరుణానిధి కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు డీఎంకే వర్గాలు ప్రకటించాయి. ఆయనకు మధుమేహం, రక్త పోటు వంటి సమస్యలు లేదని వైద్యులు తేల్చారు. కేవలం బెంగళూరులో ఉన్న పెద్దకుమార్తె సెల్వి ఇంట్లో కొంత కాలం ఉండి విశ్రాంతి తీసుకోవాలన్న కాంక్షతోనే ముందస్తు వైద్య పరీక్షల నిమిత్తం కావేరిలో కరుణానిధి చేరినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, దీనిని డీఎంకే వర్గాలు ధ్రువీకరించడం లేదు. ఇక, కరుణానిధి ఆరోగ్యం దేశ వ్యాప్తంగా నాయకులు ఆయన కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళిల వద్ద విచారిస్తున్నారు.
ఈ సమయంలో కరుణానిధి ఆరోగ్యం గురించి జయలలిత నెచ్చెలి శశికళ పరామర్శించినట్టు డీఎంకేలో చర్చ సాగుతుండడం గమనార్హం. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి స్టాలిన్ అపోలో ఆసుపత్రికి వెళ్లి మరీ విచారించిన విషయం తెలిసిందే. అలాగే, కరుణానిధి సతీమణి రాజాత్తి అమ్మాల్ కూడా అపోలోకు వెళ్లి మరీ పరామర్శించినట్టు ప్రచారం సాగింది. ఈ పరిస్థితుల్లో కరుణానిధి ఆరోగ్యం గురించి రాజాత్తి అమ్మాల్ ను శశికళ అడగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.