షిల్లాంగ్‌ ఎందుకు మండుతోంది? | Why A Tiff Between Sikhs And Khasis Escalated Into Violence | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 4 2018 4:45 PM | Last Updated on Mon, Jun 4 2018 6:29 PM

Why A Tiff Between Sikhs And Khasis Escalated Into Violence - Sakshi

ముత్తాత దంపతుల నుంచి తాము అక్కడే నివసిస్తున్నట్లు వారి ఫొటోచూపిస్తున్న దళితుడు. 

సాక్షి, న్యూఢిల్లీ : ‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ గురువారం రాత్రి వాట్సాప్‌లో నకిలీ వార్త ప్రచారం కావడంతో షిల్లాంగ్‌లోని పంజాబీ లైన్‌ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖాసీ (అగ్రవర్ణ కులం) వర్గానికి చెందిన కొంత మంది యువకులు పంజాబీ లైన్‌ లేదా స్వీపర్స్‌ కాలనీ సమీపంలో గుమిగూడారు. అప్పటికే అక్కడ భద్రతా విధులు నిర్వహిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ పోలీసులతో ఘర్షణకు దిగారు. గుంపులో నుంచి ఓ యువకుడు ఇనుప రాడ్‌తో కొట్టడంతో పోలీసు సూపరింటెండెంట్‌ స్టీపెన్‌ రింజా తీవ్రంగా గాయపడ్డారు. ఆ అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు గోళాలను  ప్రయోగించారు. పంజాబీ కాలనీ, పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు, ఆ తర్వాత కర్ఫ్యూ విధించారు. నేటికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాంతో కాలనీని విడిచి దాదాపు 500 మంది దళిత సిక్కులు పిల్లా పాపలతో సమీపంలోని గురుద్వార్‌లో తలదాచుకుంటున్నారు. అక్కడి కమ్యూనిటీ కిచెన్‌లో వంటచేసుకొని అక్కడే కాలం గడుపుతున్నారు. 

గురవారం ఉదయం జరిగిన ఓ సంఘటన ఇంతటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. మేఘాలయ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సును ఎక్కడ పార్క్‌ చేయాలనే విషయమై బస్సు డ్రైవర్, కొంత మంది పంజాబీ మహిళలకు మధ్య గొడవ జరిగింది. మహిళల తరపున వచ్చిన ఓ పంజాబీ యువకుడు బస్సు డ్రైవర్‌పై, అందులోని ఇద్దరు ప్రయాణికులపై చేయి చేసుకున్నారు. ఈ సంఘటనలో కంటోన్మెంట్‌ బోర్డు పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు ఆ పంజాబీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య రాజీ కుదిరింది. ‘సిక్కు మహిళల పట్ల మాకు ఎలాంటి కాఠిన్యం లేదు. దాడి చేసిన యువకుడి పట్ల ద్వేషమూ లేదు. మా గాయాల చికిత్స కోసం మాకు నాలుగు వేల రూపాయలను నష్టపరిహారంగా కూడా వారు చెల్లించారు’ అంటూ బస్సు డ్రైవర్‌ స్వయంగా రాజీ పత్రాన్ని రాసిచ్చారు. 


గురుద్వార్‌లో తలదాచుంటున్న మహిళలు

‘పంజాబీ బృందం ఇద్దరు ఖాసీ బాలల తలలు నరికారు’ అంటూ అదే రోజు రాత్రి వాట్సప్‌లో వచ్చిన ఫేక్‌ న్యూస్‌ ఒక్కసారిగా కలకలం రేపింది. శుక్రవారం రాత్రి పంజాబీ కాలనీ పరిసర ప్రాంతాల్లో, ఖాసీలు ఎక్కువగా ఉన్న షిల్లాంగ్‌ ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సైన్యం కవాతు కూడా నిర్వహించింది. తరతరాలుగా తాము పంజాబీ కాలనీలో ప్రశాంతంగా జీవిస్తున్నామని, తాము మరుగుదొడ్లు శుభ్రంచేసే పాకీ పనిని మానేసిన 1980 వ దశకం నుంచే అగ్ర కులానికి చెందిన ఖాసీల దాడులు తమపై ప్రారంభమయ్యాయని పంజాబీ మహిళలు చెబుతున్నారు. తమను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని స్థానిక పంచాయతీ కౌన్సిల్‌ సెక్రటరీ గుర్జీత్‌ సింగ్‌ ధృవీకరించారు. 

బ్రీటీషర్ల కాలం నుంచి..
బ్రిటీష్‌ కాలం నుంచి, దాదాపు 160 సంవత్సరాలుగా పంజాబీ దళితులు ఈ కాలనీలోనే నివసిస్తున్నారు. వీధులను ఊడ్చేందుకు, మరుగు దొడ్లను శుభ్రం చేసేందుకుగాను బ్రిటీషర్లు 1853లో పంజాబీ దళితులను తీసుకొచ్చారు. వారు నివసించేందుకు అప్పటి మిల్లీయం సియెమ్‌ (మిల్లీయం పాలకుడు) కొంత భూమిని వారికి రాసిచ్చారు. ఆ తర్వాత 1863, డిసెంబర్‌లో ఇదే నివాస స్థలంపై బ్రిటీష్‌ ప్రభుత్వానికి, స్థానిక పాలకుడికి, పంజాబీ దళితులకు మధ్య అధికారిక ఒప్పందం కుదిరింది. అయితే ఇప్పుడు తామున్నది అతి ఖరీదైన స్థలంగా మారడంతో తమను ఎలాగైనా ఖాళీ చేయించాలని చూస్తున్నారని కాలనీ వాసులు వాపోతున్నారు. 


గురద్వార్‌ కమ్యూనిటీ కిచెన్‌లో చపాతీలు చేస్తున్న మహిళలు

అక్రమ వలసదారులు.. 
షిల్లాంగ్‌కు చెందిన ఖాసీలు మాత్రం సిక్కు దళితులను అక్రమ నివాసితులుగానే పరిగణిస్తున్నారు. పంజాబీ కాలనీకి చెందిన కొంత మంది యువకులు నేరాలకు పాల్పడుతున్నారన్నది కూడా అభియోగం. 1980 ప్రాంతంలోనే జిల్లా కమిషనర్‌ పంజాబీలకు ఆ స్థలాన్ని ఖాళీ చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై మేఘాలయ హైకోర్టు 1986లో స్టే ఇచ్చింది. ఖాసీ విద్యార్థి సంఘం, ఖాసీ ప్రజా సమాఖ్య లాంటి సంస్థలు అప్పుడప్పుడు పంజాబీలను ఖాళీ చేయాల్సిందిగా డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా పంజాబీలు జాతీయ షెడ్యూల్‌ కులాల కమిషన్‌కు పలు సార్లు ఫిర్యాదు చేశారు. భారత పౌరులుగా తాము దేశంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు, ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పరుచుకోవచ్చంటూ హైకోర్టులో కూడా వారు పలు పిటిషన్లు దాఖలు చేశారు. గురుద్వారాలకు, స్థానిక దేవాలయాలకు పట్టాలు మంజూరు చేసిన స్థానిక ప్రభుత్వం వారి ఇళ్ల స్థలాలకు మాత్రం ఇప్పటికీ పట్టాలు మంజూరు చేయలేదు.

మల్టీప్లెక్స్‌ నిర్మానానికి....
మున్సిపాలిటీ అనుమతి లేకుండా విద్యుత్‌ బోర్డు కూడా దళితులకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడం లేదు. అది వివాదాస్పద స్థలంగా తమ రికార్డుల్లో నమోదై ఉందని స్థానిక మున్సిపాలిటీ బోర్డు వాదిస్తోంది. ఒకప్పుడు మరుగుదొడ్డు శుభ్రం చేసిన వారికి కనీసం మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకుండా పోయింది. 2009 రాష్ట్ర గవర్నర్‌ ఆదేశాల మేరకు వారికి  కనీస సౌకర్యాలు సమకూరాయి. బీజేపీ కుట్రతో అధికారంలోకి వచ్చిన జాతీయ పీపుల్స్‌ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు అక్కడి నుంచి దళితులను షిల్లాంగ్‌ శివారులోకి తరలించి అక్కడ మల్టీఫ్లెక్స్‌ నిర్మించానుకుంటోంది. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement