పార్టీ పరాజయంపై కారణాలను విశ్లేషించుకుంటాం : సోనియా
న్యూఢిల్లీ: అస్సాం, కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై విశ్లేషణ చేసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. ఓటమిపాలైనా ప్రజల సేవకు కట్టుబడి ఉంటామని అన్నారు. ఎన్నికల విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల విశ్వాసం చూరగొనేవరకు కష్టపడతాం : రాహుల్
ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొనేవరకు కాంగ్రెస్ కష్టపడి పనిచేస్తుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి సమష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.
ఓటమిలో రాహుల్ బాధ్యతలేదు : కాంగ్రెస్
తాజా ఎన్నికల్లో ఓటమికి రాహుల్ గాంధీని బాధ్యుడిని చేయాలన్న ప్రస్తావనలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఒక్కో ఎన్నిక ఫలితాలు ఒక్కో రకంగా ఉంటాయని, వ్యక్తిగతంగా ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఈ ఎన్నిల్లో ప్రజల తీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీలో ప్రియాంకకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశముందా అన్న ప్రశ్నకు ఇప్పుడు అది అప్రస్తుతమని అన్నారు.