వివాదాల నగ్మాకు విజయం దక్కుతుందా?
వివాదాల నగ్మాకు విజయం దక్కుతుందా?
Published Thu, Apr 3 2014 6:03 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
తెలుగు, తమిళ, భోజ్ పూరి, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేసుకున్న సినీనటి నగ్మా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లోకసభ స్థానం నుంచి పోటి చేస్తున్న నగ్మా పలు అవమానాలు, వివాదస్పద సంఘటనల మధ్య ప్రచారంలో ముందుకు దూసుకెళ్తోంది. బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ, ఆమ్ ఆద్మీపార్టీ లాంటి పార్టీల ప్రభావం ఉన్న మీరట్ లో బహుముఖ పోటి నెలకొని ఉంది. అయితే అసలే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తోంది.. ఆపై బహుముఖ పోటి కష్టంగా మారిన నేపథ్యంలో ఆపార్టీకి చెందిన నేతలే నగ్మాను కష్టాల్లోకి నెడుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఓ ర్యాలీ సందర్భంగా నగ్మాను పబ్లిక్ గా ముద్దు పెట్టుకోవడం వివాదస్పదంగా మారింది. అంతేకాకుండా కొందరు కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించడంతో నగ్మా చేయి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో ముందుకు సాగుతున్న నగ్మా జీవితంలో ఎన్నో ఒడిదుకులు, ఆటుపోట్లు, విజయాలు, అపజయాలు ఉన్నాయి.
హిందు తండ్రి, ముస్లీం తల్లికి క్రిస్మస్ రోజున పుట్టిన నగ్మా అసలు పేరు నందితా మురార్జీ. తొలి చిత్రంలోనే సల్మాన్ సరసన అవకాశం చేజిక్కించుకుని భాగీ అనే చిత్రంలో నటించింది. ఆతర్వాత దక్షిణాది సీని పరిశ్రమలో స్టార్ వెలుగొందింది. తమిళ నటుడు శరత్ కుమార్ తో ప్రేమ వ్యవహారానికి బ్రేక్ పడటంతో అక్కడి నుంచి తప్పుకుని భోజ్ పూరి చిత్రాల్లో నటించింది. భోజ్ పూరి సూపర్ స్టార్ రవి కిషన్ తో 13 చిత్రాల్లో నటించింది. నగ్మా, రవి కిషన్ ల మధ్య ఆఫైర్ భోజ్ పూరి చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. రవికిషన్ తో మరోసారి ప్రేమ వ్యవహారం బెడిసికొట్టడంతో మానసికంగా కుంగిన నగ్మా మత సంబంధమైన జీవితానికి అలవాటు పడింది. ఆతర్వాత ఏ చిత్ర పరిశ్రమలోనూ అవకాశాలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి చేరువైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన ఆమె ఏఐసీసీ సభ్యురాలిగా నియమితులయ్యారు.
క్రికెట్ బెట్టింగ్ ను చట్టబద్దం చేయాలని భోపాల్ లో వ్యాఖ్యలు చేసిన నగ్మాకు ఒకప్పటి భారత క్రికెట్ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో సన్నిహిత సంబంధాలు పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. అలానే దావూద్ అనుచరుడు జమీరుద్దీన్ అన్సారీ అలియాస్ జంబోతో సన్నిహిత సంబంధాలున్న నగ్మా మెడకు గుట్కా కేసు చుట్టుకుంది. అయితే గుట్కా కేసు తనకు సంబంధం లేదని మరోనటి నగ్మా తబుస్సమ్ ఖాన్ అనే నటిపైకి నెట్టింది. ఈ కేసుతో తనకు సంబంధం లేదని తబుస్సమ్ ఖాన్ ఖండించడంతో మళ్లీ నగ్మా వివాదం చిక్కుకున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకోవడంతో గుట్కా కేసు వివాదం సద్దుమణిగింది.
ఇలాంటి వివాదాలు, ఒడిదుడుకులతో జీవితాన్ని గడిపిన నగ్మా ప్రజా జీవితంలోకి ప్రవేశించింది. అయితే రాజకీయ జీవితం అనుకున్నంత ఈజీగా సాగడం లేదు. స్వంత పార్టీ నేతలే నగ్మాకు ఆటంకంగా మారారు. ఇలాంటి అడ్డంకులను ఎదుర్కోని మీరట్ లో విజయాన్ని ఎలా సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Advertisement