జయలలితకు బెయిల్ వచ్చేనా?
సాక్షి, చెన్నై : తమ అధినేత్రి జయలలితకు బెయిల్ దక్కేనా అన్న ఉత్కంఠ అన్నాడీఎంకే వర్గాల్లో నెలకొంది. బెంగళూరులో చుక్కెదురైనా సుప్రీం కోర్టు ద్వారానైనా బెయిల్ వస్తుందా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జయలలితకు బెయిల్ రాలేదన్న వేదనతో బుధవారం ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. జయలలితకు మద్దతుగా అన్నాడీఎంకే శ్రేణులు నిరసనల ఉధృతానికి నిర్ణయించారు. వారిని వారించే రీతిలో ‘‘అమ్మ వస్తారు..! ఆందోళన వద్దు..!’’అంటూ పార్టీ శ్రేణులకు సీఎం పన్నీరు సెల్వం భరోసా ఇచ్చే పనిలో పడ్డారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్షను ఎదుర్కొంటున్న జయకు బెయిల్ వస్తుంద న్న ఆశతో అన్నాడీఎంకే వర్గాలు మంగళవారం ఎదురు చూశాయి. అభిమానులు బెయిల్ తప్పకుండా వస్తుందన్న ఆనందంలో సంబ రాలు సైతం చేసుకుని, చివరకు భంగ పడ్డారు. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయనప్పటికీ, న్యాయమూర్తి బెయిల్ నిరాకరించడంతో ఆ పార్టీ వర్గాలు నిర్వేదంలోకి వెళ్లిపోయూరుు. అదే సమయంలో న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాల్లో ఆందోళనను రెట్టింపు చేశారుు. తమ అధినేత్రికి బెయిల్ దక్కే నా..? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు జయలలిత తరపున న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే.
అయితే, సుప్రీం కోర్టులోనైనా బెయిల్ దక్కేనా అన్న చర్చ మొదలైంది. బుధవారం ఎక్కడ చూసినా జయలలితకు బెయిల్ లభించేనా, ఆమె బయటకు వచ్చేనా అన్న అంశంపై చర్చ సాగింది. ఆమెను కర్ణాటక చెర నుంచి తమిళనాడు చెరకు మార్చితే బాగుంటుందని కొందరు, ఇప్పట్లో ఆమె బయటకు వచ్చే అవకాశాలు లేవని మరికొందరు చర్చించుకోవడం గమనార్హం. నలుగురూ కలసి ఒకే సమయంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినందునే చుక్కెదురయ్యిందన్న వాదనను మరి కొందరు తెర మీదకు తెచ్చే పనిలో పడ్డారు. జయలలిత తరపు న్యాయవాదుల నిర్లక్ష్యం తోనే బెయిల్ లభించలేదని చర్చించుకుంటున్నారు. ఈ చర్చ కాస్త అన్నాడీఎంకే వర్గాల్లో మరింత ఆందోళనను రేకెత్తిస్తోంది. జయలలిత జైల్లో అనారోగ్యానికి గురైనట్టుగా ప్రచారం సైతం ఊపందుకోవడంతో మరింత ఆందోళన బయలు దేరింది.
నిరసనల ఉధృతం
జయలలితకు మద్దతుగా నిరసనలు ఉధృతం చేయడానికి అన్నాడీఎంకే వర్గాలు సిద్ధమయ్యాయి. మంగళవారం బెయిల్ రాలేదన్న ఆగ్రహంతో రాత్రి వేళ ఆ పార్టీ అభిమానులు తమ ప్రతాపం చూపించారు. దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో బస్సులపై రాళ్లు రువ్వడంతో ఆరు బస్సులు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. అలాగే, శివ గంగై జిల్లా కాలయార్ కోవిల్ గ్రామంలోని స్వర్ణ కాళేశ్వరాలయం గోపుర మరమ్మతుల పనులు సాగుతున్నాయి. ఇందు కోసం అడ్డుగా కొబ్బరి మట్టలతో గోపురం తరహాలో ఏర్పాట్లు చేసి ఉన్నారు. అన్నాడీఎంకే వర్గాలు అత్యుత్సాహానికి ఆ మట్టలు ఆహుతి అయ్యాయి. దీంతో గోపురం మంటల్లో చిక్కింది. ఆగ్రహానికి లోనైన ఆ గ్రామస్తులు అన్నాడీఎంకే చర్యలకు నిరసనగా బుధవారం బంద్ నిర్వహించారు. సేలం, నామక్కల్‌లోను బస్సులపై నిరసన కారులు ప్రతాపం చూపించినా పోలీసులు చోద్యం చూశారు. తమ పార్టీ వర్గాలు నిరసనల్ని ఉధృతం చేయడంతో శాంతించాలంటూ సీఎం పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. అమ్మ వస్తారని, ఆందోళన వద్దంటూ భరోసా ఇచ్చారు. చెన్నై కమిషనరేట్ ఆవరణలో నటి మాయ ఒంటిపైకిరోసిన్ పోసుకుని నిప్పటించుకునే యత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మెరీనా తీరంలో విద్యార్థుల నేతృత్వంలో జయలలితకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. చేపాక్కంలో ప్రభుత్వ పరిధిలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న సీ, డీ గ్రేడ్ సిబ్బంది నిరసన దీక్ష నిర్వహించారు.
ఏడుగురు బలి
జయలలితకు బెయిల్ రాలేదన్న వేదనతో ఏడుగురు మృతి చెందారు. వీరంతా అన్నాడీఎంకే కార్యాకర్తలే. సేలం అన్నత్త పట్టికి చెందిన గణేషన్ (55) గుండె పోటుతో మరణించాడు. కరుంకల్లుకు చెందిన మణి(52) తీవ్ర ఆవేదనకు లోనై స్పృహ తప్పి పడ్డాడు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దిండుగల్‌లో మారియప్పన్(55) జయలలితకు మద్దతుగా దీక్ష చేపట్టి, చివరకు అపస్మారక స్థితిలోకి వెళ్లి మరణించాడు. పుదుకోట్టై జిల్లా విరాలిమలైలలో కరుప్పయ్య భార్య ఇలంజి(35), సత్యమంగళంలో బంగారం(38), నాగపట్నంకు చెందిన రాజా(28), కోయంబత్తూరు ఇందిరానగర్‌కు చెందిన గోపాల్ ఆత్మహత్య చేసుకున్నారు. పలు చోట్ల సాగిన నిరసనలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని మరో ఆరేడుగురు ఆత్మహత్యాయత్నం చేయడం, వారిని పోలీసులు, పార్టీ వర్గాలు అడ్డుకోవడం జరిగాయి.