చైనా చర్యకు ప్రతిచర్యే భారత్ ఉద్దేశమా
ఆయుధాల ఎగుమతిదారుగా భారత్‌ను నిలబెట్టేందుకు సర్కారు కసరత్తులు ప్రారంభించింది.
బెంగుళూరు: ఆయుధాల ఎగుమతిదారుగా భారత్‌ను నిలబెట్టేందుకు సర్కారు కసరత్తులు ప్రారంభించింది. అందుకు స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసిన ఆకాశ్ క్షిపణులను అమ్మకానికి ఉంచనున్నట్లు డీఆర్‌డీవో తెలిపింది. ప్రస్తుతం వియత్నాం ఆకాశ్ క్షిపణులను తీసుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పింది. ఇదే జరిగితే చైనా నుంచి భారత్ వ్యతిరేక గొంతును వినే అవకాశం ఉంది. దక్షిణ చైనా సముద్రంపై వియత్నాంతో చైనాకు విభేదాలు ఉన్నాయి.
భారత్‌కు వ్యతిరేకంగా చైనా తీసుకుంటున్న చర్యలకు ప్రతిచర్యలతో జవాబు ఇవ్వడానికి భారత్ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే వియత్నాంతో సంబంధాలు ధృడపరచుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. ఒక్క వియత్నాంతోనే కాకుండా మరిన్ని దేశాలకు కూడా ఆయుధాలు సరఫరా చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు డీఆర్‌డీవో వెల్లడించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత్‌ను ఆయుధాల ఎగుమతిదారుగా తయారుచేయాలనే ఆలోచనతోనే ఈ సంప్రదింపులు మొదలైనట్లు చెప్పింది. అయితే ఎన్ని ఆకాశ్‌లను వియత్నాంకు భారత్ అందజేస్తుందనే విషయాన్ని మాత్రం దాచేసింది. గత ఏడాది రక్షణ సామగ్రి కొనుగోలుకు వియత్నాంకు 500మిలియన్ల డాలర్ల రుణం మంజూరు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.