ఈసారి ‘సర్జికల్ స్ట్రైక్స్’ గురి తప్పింది
Published Sat, Nov 12 2016 7:37 PM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM
న్యూఢిల్లీ: నల్ల కుబేరులపై నిజంగా ‘సర్జికల్ స్ట్రైక్స్’ చేసే సదావకాశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేజార్చుకున్నారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1978లో పదివేలు, ఐదువేల రూపాయల నోట్లను నిషేధించినప్పుడు దేశంలో ఆర్థికంగా మంచి ఫలితాలు వచ్చాయని, వ్యక్తుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు కూడా తరిగి పోయాయని వారంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ వెయ్యి రూపాయల నోటుకు మించిన నోట్లను భారత ప్రభుత్వం తీసుకరాకపోవడం కూడా కొంత నల్ల డబ్బును అరికట్టిందని వారు చెబుతున్నారు.
ఇప్పుడు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను నిషేధిస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, అయితే రెండు వేల రూపాయల కొత్త నోటును తీసుకురావడం ద్వారా అనసరంగా లక్ష్యాన్ని గురితప్పారని కొంతమంది ఆర్థిక వేత్తల అభిప్రాయం. రెండు వేలకు బదులుగా రెండు వందల నోటును తీసుకొచ్చి ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉండేవని వారంటున్నారు. కొంత మంది నల్ల కుబేరులు పెద్ద నోట్లను పరుపుల్లో దాచుకుంటారని ఓ నానుడిగా చెబుతారు. దాని ప్రకారమే ఆలోచిస్తే రెండు పరుపుల్లో దాచుకునే సొమ్ము ఇప్పుడు ఒక్క పరుపులోనే దాగి పోతుంది. కొత్త నోటు పాత వెయ్యి రూపాయిలకన్నా పలుచగా ఉన్నందున మరిన్ని ఎక్కువ నోట్లను దాచుకోవచ్చు.
కొత్త ఐదు వందలు, రెండు వేల రూపాయల నోట్లను ముద్రించడానికి ఆర్బీఐకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యుంటాయని, వాటికి బదులు 200 నోట్లను మాత్రమే తీసుకొచ్చి, ఆన్‌లైన్, మొబైల్ చెల్లింపుల వ్యవస్థను ప్రోత్సహించినట్లయితే నరేంద్ర మోదీకి ఆశించిన ప్రయోజనం దక్కేదని ఆర్థిక నిపుణుల అంచనా. పేటీఎం, ఫ్రీచార్జ్, పేటూయు లాంటి ఆన్‌లైన్ చెల్లింపుల సంస్థలెన్నో నేడు అందుబాటులోకి వచ్చాయి. మరింత సులువైన అప్లికేషన్లతో మరిన్ని సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ చెల్లింపులను ప్రోత్సహించినట్లయితే క్రమంగా నల్లడబ్బు దానంతట అదే కరుగుతూ వచ్చేది.
నల్ల డబ్బంటే కేవలం డబ్బు రూపంలోనిదేనన్న భ్రమ కొంత మంది ప్రజల్లో ఉంది. ప్రధానంగా స్థలాలు, బంగారం రూపంలో ఎక్కువగా ఉంటోంది. ఈ బంగారమే విదేశీ బ్యాంకులకు నల్ల డబ్బును తరలించేందుకు ప్రధాన సాధనంగా కూడా మారింది. కేవలం నల్ల డబ్బును అరికట్టినంత మాత్రాన అవినీతి, చీకటి సొమ్ము నిలిచిపోదు. అన్ని రూపాల్లో ఉన్న నల్ల డబ్బును అరికట్టాలంటే సింగిల్ ఎంట్రీ పాస్‌బుక్ వ్యవస్థను తీసుకరావచ్చు. దానికి అవసరమైతే ఆధార్ కార్డును కూడా జత చేయవచ్చు.
దేశ పౌరుడికి దేశ, విదేశాల్లో ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో వాటిన్నింటి వివరాలను ఆ పాస్ బుక్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. బంగారు నగల విలువలను కూడా జత చేయాలి. ప్రతి పౌరుడి ఆర్థిక లావాదేవీలు ఆటోమేటిక్‌గా ఆ పాస్‌బుక్‌లోకి ఎంట్రీ అవ్వాలి. వాటికి ప్రతి పౌరుడి నుంచి కచ్చితంగా డిక్లరేషన్ తీసుకోవాలి. డిక్లరేషన్‌ను ఉల్లంఘించినట్లయితే కఠిన శిక్షలు అమలుచేసే చట్టాలు తేవాలి. అప్పుడే మోదీ కల సంపూర్ణంగా నెరవేరగలదని కొంత మంది ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
Advertisement
Advertisement