
'రెచ్చగొడుతున్నవారిని గుర్తించాం'
కశ్మీర్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
శ్రీనగర్: కశ్మీర్ ప్రజలు శాంతి కోరుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాష్ట్రంలో 95 శాతం మంది శాంతి కోరుకుంటున్నారని, వీరందరినీ కలుపుకుపోతామన్నారు. కశ్మీర్ మెహబూబా ముఫ్తీతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా 20 ప్రతినిధుల బృందాలతో, 300 మందితో భేటీ అయ్యాయనని చెప్పారు.
కశ్మీరీ యువత చేతిలో ఉండాల్సింది పుస్తకాలు, పెన్నులు, కంప్యూటర్లే కానీ రాళ్లు కాదని ఇంతకుముందే చెప్పానని గుర్తు చేశారు. కశ్మీర్ లో యువతను రెచ్చగొడుతున్న వారిని గుర్తించామని వెల్లడించారు. ఆర్మీపై దాడికి యువతను కొన్ని శక్తులు పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. కశ్మీరీలకు అన్నివిధాలా సహాయపడేందుకు నోడల్ అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. అల్లర్లలో 4500 మందిపైగా సైనికులు గాయపడ్డారని వెల్లడించారు. వరదల సమయంలో సైనికులు అందించిన సేవలను గుర్తు చేసుకోవాలని సూచించారు. కశ్మీర్ భవితవ్యంతోనే భారత్ భవిష్యత్ ముడిపడివుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాళ్లు విసరడం కశ్మీర్ సమస్యకు పరిష్కారం కాదని మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు.