సాక్షి, హైదరాబాద్: రైల్వే ఆహారం అంటేనే చాలా మందికి దడ పుడుతుంది. అపరిశుభ్ర వాతావరణంలో, రుచీపచీ లేకుండా, కనీసం చూడడానికీ బాగోలేని ఆహారం గుర్తుకొస్తుంది. కానీ ఇక ముందు పరిశుభ్ర పరిస్థితులలో వండిన నాణ్యత, రుచి ఉన్న మంచి ఆహారం అందించే దిశగా ఐఆర్‌సీటీసీ సరికొత్త చర్యలు చేపడుతోంది. రైల్వే క్యాంటీన్లలో పరిస్థితి, సిబ్బంది పనితీరు, ఆహార పదార్థాల తయారీ, నాణ్యతా ప్రమాణాలపై నిఘా పెట్టేందుకు ‘వోబోట్’అనే కృత్రిమ మేధస్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుంది. రైల్వే క్యాంటీన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. అవి రికార్డు చేసిన సమాచారాన్ని ‘వోబోట్’తో విశ్లేషించడం ద్వారా లోపాలను సరిదిద్దనుంది. ఈ సరికొత్త టెక్నాలజీని దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొలుత సికింద్రాబాద్, రేణిగుంట, గుంతకల్ రైల్వేస్టేషన్లలో ఉన్న ఐఆర్‌సీటీసీ క్యాంటీన్‌లలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద బేస్ కిచెన్‌లోనూ ‘వోబోట్’నిఘా పెట్టనున్నారు.
ఎక్కడ చూసినా అపరిశుభ్రతే..
దక్షిణ మధ్య రైల్వేలో వివిధ ప్రాంతాల మధ్య రోజూ 10 లక్షల మందికిపైగా రాకపోకలు సాగిస్తారు. సుమారు 800 రైళ్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆహార పదార్థాలను అందజేసేందుకు ప్యాంట్రీ కార్లను ఏర్పాటు చేశారు. స్టేషన్లలో రెస్టారెంట్లు, క్యాంటీన్లు ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషన్లలో ఐఆర్‌సీటీసీ కేటరింగ్ సంస్థలు, హోటళ్లు ఆహార పదార్ధాలను అందజేస్తున్నాయి. అయితే ప్యాంట్రీ కార్లు, క్యాంటీన్లలో అపరిశుభ్రత తాండవిస్తుంటుంది. దీనికితోడు చెత్తాచెదారం, ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు, ప్రయాణికులకు అందజేసేటప్పుడు సిబ్బంది యూనిఫామ్ ధరించకపోవడం, చేతులకు గ్లౌజులు వంటి లేకుండానే పనులు చేయడం, తలపై టోపీ ధరించకపోవడం వంటివాటిపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
దీనికితోడు మరోవైపు ఆహార పదార్థాల ధరలు ఎక్కువ, పరిమాణం తక్కువ. వంద గ్రాముల ఇడ్లీ ధర రూ.28. కానీ పరిమాణం 80 గ్రాములే ఉంటుంది. 250 గ్రాముల పెసరట్టు ధర రూ.55 వరకు ఉంటుంది. కానీ ప్రయాణికుడి చేతికి ఇచ్చేది 200 గ్రాములే. ఇక పూర్తిగా చల్లారిపోయిన ఆహార పదార్థాలను సరఫరా చేయడం, వాటర్ బాటిళ్లపైన కూలింగ్ చార్జీల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేయడంపైనా ప్రయాణికులు తరచుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి ఏటా 2 వేలకుపైగా ఫిర్యాదులు అందుతున్నాయి. గతేడాది కంప్ట్రోలర్ ఆడిటర్ నివేదిక సైతం ఈ అంశాలను ఎత్తి చూపింది. దీంతో రైల్వేలో చలనం మొదలైంది. ఐఆర్‌సీటీసీ కిచెన్లలోనే నిఘాను కట్టుదిట్టడం చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఫలితాల ఆధారంగా విస్తరణ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని తొలి ప్లాట్‌ఫామ్ పైఅంతస్థులో ఉన్న సాధారణ కిచెన్‌లో మొదట ‘వోబోట్’పరిజ్ఞానాన్ని అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఈ కిచెన్ ద్వారా రోజూ 10 వేల నుంచి 15 వేల మంది ప్రయాణికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనాలు అందజేస్తున్నారు. ఈ కిచెన్‌లో ‘వోబోట్’ను ఏర్పాటు చేశాక వచ్చే ఫలితాలను అనుసరించి.. ఇదే స్టేషన్‌లోని 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు నిర్మించతలపెట్టిన బేస్ కిచెన్‌లో పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఆ బేస్ కిచెన్ ద్వారా రోజూ సుమారు 80 ప్రధాన రైళ్లలో రాకపోకలు సాగించే 1.5 లక్షల మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఆహార పదార్థాలను తయారు చేసి సరఫరా చేయనున్నారు. ఇక రేణిగుంట, గుంతకల్ స్టేషన్లలోనూ ఇదే తరహాలో అమలు చేస్తారు.
‘వోబోట్’తో నిఘా ఇలా..
‘వోబోట్’అనేది కృత్రిమ మేధో పరిజ్ఞానం. ఐఆర్‌సీటీసీ కిచెన్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా వచ్చే వీడియో దృశ్యాలను ఈ సాంకేతిక పరిజ్ఞానం ఆటోమేటిగ్గా విశ్లేషిస్తుంది. కిచెన్‌లో ఎక్కడెక్కడ చెత్త చెదారం, దుమ్ము, ధూళీ ఉన్నదీ గుర్తిస్తుంది. వంటపాత్రలు, ప్రయాణికులకు ఆహార పదార్థాలను అందజేసే ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తుంది. అలాగే సిబ్బంది పనితీరును, కదలికలను, అనధికార వ్యక్తుల కదలికలను విశ్లేషిస్తుంది. సిబ్బంది యూనిఫామ్ వేసుకోకపోయినా, గ్లౌజులు ధరించకపోయినా వెంటనే పసిగడుతుంది. ఈ అంశాలన్నింటినీ నివేదికగా అందజేస్తుంది. మొత్తంగా ఆహార పదార్థాలను తయారు చేయడం నుంచి ప్రయాణికులకు అం దజేయడం వరకు సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ఈ కృత్రిమ మేధో పరిజ్ఞానం దోహదం చేస్తుంది. దీని ద్వారా వచ్చే నివేదికల ఆధారంగా సిబ్బందిని వెంటనే విధుల నుంచి తప్పించి క్రమశిక్షణా చర్యలు చేపడుతారు. కాంట్రాక్టర్లను తొలగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment