
కాంగ్రెస్ నాయకురాలి జుట్టు కత్తిరించారు
కోచి: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థిపై పోటీ చేసినందుకు ఓ మహిళా కాంగ్రెస్ నేతపై ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాడి చేసి.. ఆమె జుట్టును బలవంతంగా కత్తిరించారు. తిరువనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనను కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ తీవ్రంగా ఖండించారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యర్థి పార్టీలపై అసహనం పెరిగిపోతోందని, ఈ ఘటనే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సతికుమారి (50) పెరుంకడవిలా బ్లాక్ పంచాయతీ నుంచి పోటీ చేసి ఓడిపో్యారు. ఈ నెల 11న తిరువనంతపురానికి 20 కిలో మీటర్ల దూరంలో అమరవిలా వద్ద ఇద్దరు వ్యక్తులు సతికుమారిపై దౌర్జన్యం చేసినట్టు పోలీసులు తెలిపారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉమెన్ చాందీ తెలిపారు. సహనమే ప్రజాస్వామ్యానికి బలమని అన్నారు. సీపీఎంకు ప్రత్యర్థి పార్టీలపై అసహనం పెరిగిపోతోందని విమర్శించారు.