
మరో నిర్భయ గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన ఓ వివాహిత(35)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి నమ్మించి అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసులు కథనం ప్రకారం.. నోయిదాడకు చెందిన ఓ మహిళ తన భర్త దగ్గరకు వెళ్లేందుకు బస్టాప్ లో వేచి వుంది. ఇంతలో స్కార్పియో లో వచ్చిన నలుగురు వ్యక్తులు, లిఫ్ట్ ఇస్తామని, గమ్యానికి చేరుస్తామని ఆమెను నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఆఫర్ చేసి ...ఆమె మత్తులోకి జారుకున్నాక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి పారిపోయారు.
అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను పోలీసులు గమనించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు... నిందితులు వీరు, సమీర్ గా గుర్తించారు. మిగిలిన ఇద్దరినీ గుర్తించే ప్రయత్నంలో వున్నామని కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.