సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఇటీవల కలకలం రేపిన అనుమానాస్పద మరణాల మిస్టరీ త్వరలోనే వీడనుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వేముల శ్రీకాంత్ శనివారం మరణించడంతో అసలేం జరుగుతోందన్న గందరగోళం నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. శ్రీకాంత్ విషం తీసుకున్నాక వాంతులయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు విషయం తెలియకుండా వైద్యం చేయడం కష్టమని తేల్చిచెప్పారు. దీంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు.
వెంటనే వారు చికిత్స ప్రారంభించినా శ్రీకాంత్‌ను కాపాడలేకపోయారు. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి ఎస్సై రాజు కూడా ధ్రువీకరించారు. శ్రీకాంత్ భార్యా పిల్లలు కూడా ఇదే లక్షణాలతో మరణించారు. ముగ్గురు కూడా రక్తపు వాంతులు, విరేచనాలతో మరణించడంతో వారి శరీరంలోనూ ఇదే విషం కలిసిందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. శ్రీకాంత్ ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలో పీజీ చేశాడు. కరీంనగర్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో ఫుడ్ సైన్స్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. రసాయనాల గుణగణాలపై పూర్తి అవగాహన ఉండటంతో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుని ఉంటాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ.. అతనికి ఇది ఎక్కడ నుంచి వచ్చింది? అన్న ప్రశ్నకు ఇంకా సమాధానాలు దొరకాల్సి ఉంది. విద్యార్థులకు ప్రయోగాలు చేయించే ల్యాబ్ నుంచి తీసుకువచ్చి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
33 రోజుల్లో ముగ్గురి ఆకస్మిక మరణాలు..!
తొలుత కుమారుడు అద్వైత్ (20నెలలు) బా బు వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురయ్యాడు. తొలుత కరీంనగర్‌కు, ఆ తరువాత హైదరాబాద్ తరలించి చికిత్స అందించినా బాబు ప్రాణాలు నిలవలేదు. చివరికి నవంబరు 16న అద్వైత్ కన్నుమూశాడు.
అద్వైత్ మరణించాక నవంబరు 29న అవే లక్షణాలతో కూతురు అమూల్య (6) అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 1న ప్రాణాలు విడిచింది. ఈ రెండు మరణాలకు వైద్యులు కారణాలు చెప్పలేకపోయారు.
ఈ మరణాలపై రకరకాల ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కుటుంబానికి చేతబడి చేశారని కొందరు, అంతుచిక్కని వ్యాధి వచ్చిందని రకరకాలుగా చెప్పుకున్నారు.
తన పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలు రెండువారాల వ్యవధిలో దూరమై తల్లడిల్లుతున్న శ్రీకాంత్ భార్య మమత (26) కూడా డిసెంబరు 15న ఆసక్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ.. డిసెంబరు 18న మరణించింది. దీంతో మమత కుటుంబ సభ్యుల్లో అనుమానాలు మొదలయ్యాయి. కేవలం 33 రోజుల్లో ఒకే కుటుంబంలో మూడు మరణాలు సంభవించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. తమ మనవలు, కూతురు అనుమానాస్పద మరణాల వెనక అల్లుడి పాత్ర ఉందని మమత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాంత్ ఇంటి సమీపంలోని బావి నీళ్లను, బంధువుల రక్త నమూనాలను పరీక్షిస్తే వాటిలో ఏమీ తేలలేదు.
పోలీసుల వినతి మేరకు మమత పోస్టుమార్టం సమయంలో వైద్యులు విస్రా (శరీరంలోని కీలక అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ వివరాలు వచ్చేందుకు దాదాపు నెలరోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు దర్యాప్తు వేగవంతం చేశారు. శ్రీకాంత్ పనిచేస్తున్న కాలేజీకి వెళ్లారు. అతని ప్రవర్తన గురించి స్నేహితులను ఆరా తీశారు.
ఇదే క్రమంలో ఆకస్మికంగా డిసెంబరు 30 అర్ధరాత్రి శ్రీకాంత్ విషం తీసుకున్నాడు. ఆసుపత్రిలో తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వైద్యులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో 31 తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించాడు.
అత్తామామ ఆరోపిస్తున్నట్లుగా శ్రీకాంత్ తన భార్యాపిల్లలను ఎందుకు చంపాల్సి వచ్చింది? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆస్తి గొడవలు, వరకట్నం, వివాహేతర సంబంధం కారణాలు అయి ఉ ంటాయా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతో ంది. ప్రస్తుతం పోలీసుల దృష్టి అంతా అసలు శ్రీకాంత్‌కు సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎప్పుడు ఇంటికి తె చ్చాడు? అన్న విషయాలపైనే కేంద్రీకతమైంది. ల్యాబ్ నుంచి తెచ్చాడా? బయట కొనుగోలు చేశాడా..? అన్న విషయాలు పోలీసులు తెలుసుకోగలిగితే.. అంతుచిక్కని మరణాల మిస్టరీ వీడినట్లే. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకువచ్చిన తేదీకి ముందు వెనకా జరిగిన మరణాలను పోల్చి చూస్తే శ్రీకాంత్ పాత్ర తేటతెల్లమవుతుందని ఓ సీనియర్ పోలీసు అధికారి అభిప్రాయపడ్డాడు.
ఫోరెన్సిక్ రిపోర్టు రావాల్సి ఉంది: ఎస్సై రాజు
వేముల శ్రీకాంత్ కుటుంబం విషయంలో ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. శ్రీకాంత్ ఆసుపత్రిలో వైద్యులకు తాను సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నానని వెల్లడించాడు. పిల్లల ఆకస్మిక మరణాల తరువాత, శ్రీకాంత్ భార్య మమత కూడా మరణించడంతో ఆమె తల్లిదండ్రులు శ్రీకాంత్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో మమత పోస్టుమార్టం సమయంలో విస్రా (శరీర అంతర్భాగాలు)ను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) హైదరాబాద్ పంపాం. ఆ నివేదిక ఇంకా రావాల్సి ఉంది.
ఏంటి సోడియం హైడ్రాక్సైడ్?
స్కూళ్లు, కాలేజీల్లో రసాయన ప్రయోగాలు చేసేందుకు సోడియం హైడ్రాక్సైడ్ (ఎన్‌ఏఓహెచ్)ను వాడుతారు. దీన్ని కాస్టిక్ సోడా అని కూడా పిలుస్తారు. మామూలుగా ఇండ్లలో జామైన సింకులు, పైపులైన్లు క్లియర్ చేసేందుకు వాడుతుంటారు. స్పటికాల రూపంలో కర్పూరాన్ని తలపించేలా ఉంటుంది. ఇది మనుషులకు చాలా ప్రమాదకరమైన రసాయన సమ్మేళనం. పొరపాటున చేతులపై పడినా.. చర్మం పగిలి రక్తస్రావం జరుగుతుంది. ఇది నీటిలో సులువుగా కరుగుతుంది.
కనీసం 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం మనిషి శరీరంలోకి వెళితే.. వెంటనే అది జీర్ణాశయం, కిడ్నీలు, కాలేయం, రక్తం ద్వారా ఊపిరితిత్తులు, మెదడుకు చేరిపోతుంది. శరీర అంతర్భాగాల ఉపరితాలు పగిలి రక్తస్రావం జరుగుతుంది. అందుకే.. శ్రీకాంత్ కుటుంబంలోని నలుగురు రక్తపు వాంతులు, విరేచనాలు చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రీకాంత్ విద్యార్హతలు, ప్రస్తుతం చేస్తున్న పని, అన్నీ వెరసి అతని భార్య మమత, కూతురు అమూల్య, కుమారుడు అద్వైత్ మరణాలు ఒకే విధానంలో సంభవించడంతో అందరి చావుకు ఇదే రసాయనం కారణమన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.
అత్తింటి వేధింపులే కారణం..!?
మరోవైపు వేముల శ్రీకాంత్ ఆత్మహత్యకు అతని అత్తింటి వేధింపులే కారణమని శ్రీకాంత్ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. మమత మరణానంతరం వివాహం సమయంలో ఇచ్చిన కట్నం ఇవ్వాలని వేధించారని, అతను పనిచేసే కాలేజీకి వెళ్లి నానా యాగీ చేశారని ఆరోపించారు. మరోవైపు ఈ విషయంలో రాజకీయ నేతల వద్ద పంచాయితీ పెట్టడంతో శ్రీకాంత్ మనస్తాపంతోనే విషం తీసుకున్నాడని ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment