మధ్యప్రదేశ్ః నిమ్న కులస్థుడ్ని ప్రేమించడమే ఆమె ప్రాణం తీసింది. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఊరు... పంచాయితీ పెట్టింది. ఆమెను, ఆమె కుటుంబాన్నీ ఊరునుంచి వెలి వేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జరిగిన ఘటనకు అవమానంగా భావించిన ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది.
మధ్యప్రదేశ్ తికామ్ ఘర్ కు చెందిన 25 ఏళ్ళ సాకీ పాల్ ఉదయం ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తికామ్ ఘర్ కు 12 కిలోమీటర్ల దూరంలోని కరిబజారువా లోని స్వంత ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు తగ్గ కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో సాకీని, ఆమె కుటుంబాన్ని సంఘం వెలివేసిందని, దీంతో అవమాన భారాన్ని తట్టుకోలేకపోయిన ఆమె... ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోందని సబ్ ఇనస్పెక్టర్ బీ ఎస్ రాథోర్ చెప్పారు.
నాయకుడు థానీ రామ్ గత నెల్లో కుల పంచాయితీ నిర్వహించారని, తక్కువ కులస్థుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆమెను, ఆమె కుటుంబాన్ని ఊరు వెలి వేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే తన ప్రవర్తన అటువంటిది కాదంటూ సాకీ పంచాయితీకి మొరపెట్టుకుందని, గ్రామంనుంచీ వెలి వేయడం అన్యాయం అంటూ వేడుకుందని గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. దీంతో చివరికి ఆమెపై వెలి నిర్ణయాన్ని ఎత్తివేసేందుకు అంగీకరించిన ఊరి పెద్దలు కొన్ని నిబంధనలు విధించారు. మత సంప్రదాయంలో భాగంగా గ్రామం మొత్తానికి సాకీ కుటుంబం రెండు పూటల భోజనాలు పెట్టించాలని షరతులు విధించారు. షరతులకు సైతం సాకీ కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే చివరికి ఏమైందో ఏమో సాకీ ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారి రాథోర్ చెప్పారు.
కుల బహిష్కరణతో మహిళ ఆత్మహత్య
Published Tue, Mar 15 2016 9:17 PM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM
Advertisement
Advertisement