
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రతీ త్రిపాఠీ
భోపాల్: ఇద్దరు దుండగులు ఓ యువతి వద్ద పర్సు, నగలు, సెల్‌ఫోన్ దొంగిలించి కదులుతున్న రైలు నుంచి ఆమెను కిందకు తోసేశారు. తలకు, ముఖానికీ తీవ్ర గాయాలైన బాధితురాలు భోపాల్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలోని ఓ ప్రై వేటు కంపెనీలో పనిచేస్తున్న రతీ త్రిపాఠీ(29), తల్లి మిత్యా త్రిపాఠీ, సోదరుడు ఆధ్యాత్మిక్‌తో కలసి ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నారు. తల్లి, సోదరుడు కాన్పూర్ నుంచి నేరుగా ఉజ్జయినీ చేరుకున్నారు. రతీ మంగళవారం ఢిల్లీ నుంచి మాల్వా ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్-7 బోగీలో ఉజ్జయినీ బయలుదేరారు.
అయితే బుధవారం రతీ కోసం రైల్వేస్టేషన్‌కు వచ్చిన తల్లి, సోదరునికి ఆమె కనిపించలేదు. తోటి ప్రయాణికులను విచారించగా, సీటు విషయంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు ఆమెను కదులుతున్న రైల్లోంచి తోసేసినట్లు చెప్పారు. బినా ప్రాంతంలోని లలిత్‌పూర్, కరౌడా స్టేషన్ల మధ్య బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. దీంతో వారు బినా రైల్వేస్టేషన్‌కు చేరుకుని పోలీసులను విచారించగా, తీవ్రంగా గాయపడిన యువతిని రైల్వే ట్రాక్‌పై గుర్తించినట్టు తెలిపారు. వైద్యుల సూచన మేరకు ఆమెను భోపాల్‌లోని హమీదియా ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. దీంతో భోపాల్ చేరుకున్న వారు ఆస్పత్రిలో అపస్మాతరక స్థితిలో ఉన్న రతీని చూసి చలించిపోయారు. తన కుమార్తె పర్సు, సెల్ ఫోన్, చెవి రింగులు, చైన్ దుండగులు దోచుకున్నారని రతీ తల్లి మిత్యా త్రిపాఠీ ఆరోపించారు. ఈ ఘటన గురించి తోటి ప్రయాణికులు చెప్పినా రైల్లో ఉన్న భద్రతా సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు.
ఇదిలా ఉండగా, నిందితులకు సంబంధించిన సమాచారం అందించిన వారికి 10 వేల రూపాయల రివార్డును పోలీసులు ప్రకటించారు.
**