తృప్తి దేశాయ్ (ఫైల్)
కొచ్చి: శబరిమల ఆలయంలోకి మహిళ హక్కుల కార్యకర్తలను అనుమతించబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. తృప్తి దేశాయ్ ను అడ్డుకుంటామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆలయ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని అన్నారు.
'శబరిమల ఆలయం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడి ఆచారాలు, మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందే. మహిళలకు ఆలయ ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు సంప్రదాయ ఆచారాలు కొనసాగుతాయ'ని మంత్రి స్పష్టం చేశారు.
ఆలయాల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్.. వెయ్యి మంది మహిళలతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.