Kadakampally Surendran
-
శబరిమల ఘటనలు నన్ను నొప్పించాయి
తిరువనంతపురం: కేరళ ఎన్నికల వేళ ఎల్డీఎఫ్ ప్రభుత్వం శబరిమలలో గెలుపుకోసం ఒకడుగు వెనక్కితగ్గినట్టు కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2018లో శబరిమల వివాదంపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కేరళ దేవాదాయ శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్, 2018లో శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి జరిగిన ఘటనలపట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఇది జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. మంత్రిగారి వ్యాఖ్యలపై స్పందిం చిన కాంగ్రెస్, బీజేపీలు, ఎల్డీఎఫ్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. రాజకీయ పార్టీలు, భక్తులు, సామాన్య జనంతో చర్చించాకే సుప్రీంకోర్టు తుది తీర్పుని అమలు చేస్తామని సురేంద్రన్ హామీ ఇచ్చారు. ‘‘2018లో శబరిమలలో జరిగిన ఘటనలు మనందర్నీ నొప్పించాయి. నన్ను కూడా. అలా జరగకుండా ఉండాల్సింది’’అని ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తోన్న సీపీఐ(ఎం)నాయకుడు సురేంద్రన్ వ్యాఖ్యానించారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల, సురేంద్రన్ ప్రకటన మోసపూరితమని వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మాట్లాడుతూ మంత్రిగారిది మొసలి కన్నీరు అని ఎద్దేవా చేశారు. శబరిమలకు జరిగిన అన్యాయానికి, నష్టానికి వెయ్యిసార్లు గంగానదిలో మునిగినా క్షమించలేమని వ్యాఖ్యానించారు. వివక్షకి తావులేకుండా, అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత, 2018లో, 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సున్న 12 మంది మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకోవడంతో మూడు నెలల పాటు హై డ్రామా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రధానంగా సీపీఐ(ఎం) పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది. మొత్తం 20 స్థానాల్లో 19 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పట్టుకోల్పోయిన సీపీఐ(ఎం)తిరిగి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంపుంజుకుంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం సీపీఐ(ఎం) నిర్వహించిన ఇంటింటి సర్వేలో శబరిమల విషయంలో ఒక వర్గం ప్రజలు ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు గుర్తించింది. ‘శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్త్రుత ధర్మాసనం ముందుంది. తుది తీర్పు ఏదైనప్పటికీ, ప్రజలతోనూ, భక్తులతోనూ, రాజకీయ పార్టీలతోనూ చర్చించాకే దాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులుకాని, శబరిమల పోరాటానికి సంబంధించిన అన్ని సాధారణ కేసులను, ఇటీవలే పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మంత్రి సురేంద్రన్ గుర్తుచేశారు. చదవండి: అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ వీడిన సీనియర్ నేత ఆయన మాట వినకుండా తప్పు చేశానన్న ఇందిరాగాంధీ! -
శబరిమలలో భక్తుల రద్దీ
శబరిమల: మండల మకర విళక్కు పూజల కోసం ఆదివారం భారీ సంఖ్యలో భక్తులు శబరిమల ఆలయానికి తరలివచ్చారు. వార్షిక మకర విళక్కు పూజల కోసం అయ్యప్ప దేవాలయాన్ని శనివారం తెరచిన విషయం తెలిసిందే. ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకు గర్భగుడిని దేవాలయ ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి తెరచి, నెయ్యాభిషేకం, మహా గణపతి హోమం సహా పలు ప్రత్యేక పూజలు జరిపారు. కేరళ దేవాదాయ మంత్రి కే సురేంద్రన్ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు వాసు, బోర్డు సభ్యులు, దేవాదాయ కమిషనర్ ఎం హర్షన్ తదితరులు ఆ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. వార్షిక మండల పూజల నిమిత్తం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఆదివారం భక్తులు శబరిమలకు పోటెత్తారు. ఆలయ పరిసరాల్లో, గుడికి వెళ్లే మార్గాల్లో భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. 10 మంది డీఎస్పీలు, 30 మంది ఇన్స్పెక్టర్లు, 120 మంది ఎస్సై/ఏఎస్సైలు, 1400 మంది కాన్‌స్టేబుళ్లను భక్తుల భద్రత కోసం సన్నిధానం వద్ద విధుల్లో ఉంచారు. 2018 తీర్పుపై స్టే ఉన్నట్లే! మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే అమల్లో ఉన్నట్లే భావించాలని కేరళ న్యాయ శాఖ మంత్రి ఏకే బాలన్ ఆదివారం వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పునకు అనుగుణంగానే తమ ప్రభుత్వం నడుచుకుంటుందన్నారు. ‘రాజ్యాంగబద్ధ ప్రభుత్వంగా కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం. కానీ ఇక్కడో సమస్య ఉంది. 2018లో ఇచ్చిన తీర్పుపై తాజాగా ఈ నవంబర్ 14న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో స్టే ఇచ్చారా? లేదా? అన్నది కీలక ప్రశ్న. స్టే ఇస్తున్నట్లు తీర్పులో ప్రకటించలేదు. కానీ వాస్తవానికి స్టే ఇచ్చినట్లే భావించాల్సి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. ప్రచారం కోసం ఆలయానికి రావాలనుకునే మహిళలను ప్రోత్సహించబోమని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
‘మీరంతా ప్రభాస్‌ని చూసి నేర్చుకొండి’
తిరువనంతపురం : ‘మీరంతా ఒక్కో సినిమాకు 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటారని విన్నాను. అంత సంపాదిస్తున్న మీరు కేరళ ప్రజలను ఆదుకోవడానకి చాలా తక్కువ మొత్తం సాయం చేశారు. మీకంటే తెలుగు హీరో ప్రభాస్ నయం. అతన్ని చూసి నేర్చుకొండి’ అంటూ కేరళ పర్యటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మలయాళ నటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండపోత వర్షాలు, వరదల కారణంగా కేరళ అతాలకుతలమయిన సంగతి తెలిసిందే. వరద బాధితుల సంరక్షణ నిమిత్తం సోమవారం కేరళ ప్రభుత్వం ‘కేర్ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సురేంద్రన్ మాట్లాడుతూ ‘మన రాష్ట్రంలో ఎందరో సూపర్స్టార్లు ఉన్నారు. వారు ప్రతీ సినిమాకు 4 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారని విన్నాను. అంత సంపాదించే వారు వరద బాధితులకు చాలా తక్కువ మొత్తంలో సాయం చేశారు. మీలాంటి వారంతా ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. ఆయన ఇంతవరకూ మలయాళ సినిమాల్లో నటించింది లేదు. అయినప్పటికీ కేరళ వరదల గురించి తెలిసిన వెంటనే సాయం చేయడానికి ముందుకొచ్చి.. కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారంటా’ అంటూ సురేంద్రన్ మలయాళ నటులపై మండిపడ్డారు . మలయాళ నటులకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే ఎక్కువ నగదు సాయం చేశారని సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవానికి ప్రభాస్ కేరళ వరద బాధితులకు సాయం చేసింది కేవలం 25 లక్షల రూపాయలు మాత్రమే. ఈ విషయం సదరు మంత్రి గారికి తెలియకపోవడంతో ప్రభాస్‌ని చూసి నేర్చుకొండి అంటూ వ్యాఖ్యానించారు. అయితే కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆర్థికంగా సాయం చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ రూ.కోటి విరాళంగా ఇచ్చారు. ఇటీవల కమల్‌హాసన్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, అనుపమ పరమేశ్వరన్, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, ధనుష్, రజనీకాంత్, శివకార్తికేయ, నయనతార, విశాల్, విక్రమ్, విజయ్ దేవరకొండ, నాగార్జున తదితరులు కేరళ కోసం తమవంతు సాయం చేశారు. -
కేరళ పర్యాటకశాఖ మంత్రికి కేంద్రం షాక్
సాక్షి, త్రివేండ్రం: కేంద్ర ప్రభుత్వంపై కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ టూరిజం మంత్రి విషయంలో విదేశాంగ శాఖ వ్యవహరించిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాలో ఈ నెల 11 నుంచి 16 తేదీల మధ్య గ్లోబల్ టూరిజం సదస్సు నిర్వహిస్తున్నారు. కేరళ టూరిజం శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌కు సదస్సుకు రావాలంటూ ఆహ్వానం అందింది. అయితే విదేశాంగ శాఖ మాత్రం మంత్రి సురేంద్రన్‌కు అనుమతి నిరాకరించింది. దీనిపై ఆయన కేంద్రానికి లేఖ రాయగా, దానికి బదులు కూడా ఇవ్వలేదంట. ‘ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమన్న విషయం స్పష్టమౌతోంది. కనీసం కారణాలు కూడా వివరించలేదు’ అని సురేంద్రన్ తెలిపారు. ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. అయితే విదేశాంగ శాఖ మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. పలు కోణాల్లో పరిశీలించాకే మంత్రి సురేంద్రన్‌కు అనుమతి నిరాకరించామని స్పష్టం చేసింది. ఇక ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్విట్టర్లో స్పందించారు. ఇదో దురదృష్టకరమైన ఘటన అని, కేంద్రం నిర్ణయంతో రాష్ట్రం షాక్‌కి గురైందని, కేంద్ర పక్షపాత ధోరణిపై తాము నిరసన తెలిపి తీరతామని ట్విట్టర్లో విజయన్ తెలిపారు. Central Govt denied permission to Kerala Tourism Minister Kadakampally Surendran to visit China for attending a tourism meet. UNFORTUNATE ! pic.twitter.com/nWT1mwfasY — Pinarayi Vijayan (@vijayanpinarayi) September 8, 2017 Entire Kerala is shocked, We register strong protest against this discriminatory & biased decision of the Ministry of External Affairs. — Pinarayi Vijayan (@vijayanpinarayi) September 8, 2017 -
'ఆమెను ఆలయంలోకి వెళ్లనీయం'
కొచ్చి: శబరిమల ఆలయంలోకి మహిళ హక్కుల కార్యకర్తలను అనుమతించబోమని కేరళ ప్రభుత్వం స్పష్టం చేసింది. తృప్తి దేశాయ్ ను అడ్డుకుంటామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. శబరిమలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆలయ సంప్రదాయాలను అందరూ గౌరవించాలని అన్నారు. 'శబరిమల ఆలయం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలో ఉంది. ఇక్కడి ఆచారాలు, మార్గదర్శకాలను అందరూ పాటించాల్సిందే. మహిళలకు ఆలయ ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడే వరకు సంప్రదాయ ఆచారాలు కొనసాగుతాయ'ని మంత్రి స్పష్టం చేశారు. ఆలయాల్లో మహిళల హక్కుల కోసం పోరాడుతున్న భూమాత బ్రిగేడియర్ సంస్థ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్.. వెయ్యి మంది మహిళలతో శబరిమల ఆలయంలోకి ప్రవేశించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయన ఈవిధంగా స్పందించారు. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.