తిరువనంతపురం: కేరళ ఎన్నికల వేళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం శబరిమలలో గెలుపుకోసం ఒకడుగు వెనక్కితగ్గినట్టు కనిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం 2018లో శబరిమల వివాదంపై పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. కేరళ దేవాదాయ శాఖా మంత్రి కడకంపల్లి సురేంద్రన్, 2018లో శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి జరిగిన ఘటనలపట్ల విచారం వ్యక్తం చేస్తూ, ఇది జరిగి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. మంత్రిగారి వ్యాఖ్యలపై స్పందిం చిన కాంగ్రెస్, బీజేపీలు, ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
రాజకీయ పార్టీలు, భక్తులు, సామాన్య జనంతో చర్చించాకే సుప్రీంకోర్టు తుది తీర్పుని అమలు చేస్తామని సురేంద్రన్ హామీ ఇచ్చారు. ‘‘2018లో శబరిమలలో జరిగిన ఘటనలు మనందర్నీ నొప్పించాయి. నన్ను కూడా. అలా జరగకుండా ఉండాల్సింది’’అని ఏప్రిల్ 6న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తోన్న సీపీఐ(ఎం)నాయకుడు సురేంద్రన్ వ్యాఖ్యానించారు. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల, సురేంద్రన్ ప్రకటన మోసపూరితమని వ్యాఖ్యానించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ మాట్లాడుతూ మంత్రిగారిది మొసలి కన్నీరు అని ఎద్దేవా చేశారు. శబరిమలకు జరిగిన అన్యాయానికి, నష్టానికి వెయ్యిసార్లు గంగానదిలో మునిగినా క్షమించలేమని వ్యాఖ్యానించారు. వివక్షకి తావులేకుండా, అన్ని వయస్సుల మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత, 2018లో, 10 నుంచి 50 ఏళ్ళ మధ్య వయస్సున్న 12 మంది మహిళలు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకోవడంతో మూడు నెలల పాటు హై డ్రామా జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో కేరళలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం ప్రధానంగా సీపీఐ(ఎం) పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరువాత 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బతగిలింది. మొత్తం 20 స్థానాల్లో 19 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పట్టుకోల్పోయిన సీపీఐ(ఎం)తిరిగి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంపుంజుకుంది.
లోక్‌సభ ఎన్నికల అనంతరం సీపీఐ(ఎం) నిర్వహించిన ఇంటింటి సర్వేలో శబరిమల విషయంలో ఒక వర్గం ప్రజలు ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు గుర్తించింది. ‘శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విస్త్రుత ధర్మాసనం ముందుంది. తుది తీర్పు ఏదైనప్పటికీ, ప్రజలతోనూ, భక్తులతోనూ, రాజకీయ పార్టీలతోనూ చర్చించాకే దాన్ని అమలు చేస్తాం’ అని మంత్రి వ్యాఖ్యానించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులుకాని, శబరిమల పోరాటానికి సంబంధించిన అన్ని సాధారణ కేసులను, ఇటీవలే పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని మంత్రి సురేంద్రన్ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment