జైపూర్ : కన్నకొడుకు అస్వస్థతకు గురయ్యాడని తెలిసి లాక్‌డౌన్ వేళ మూడురోజుల ప్రయాణంలో ఆరు రాష్ట్రాలు దాటి 2700 కిలోమీటర్లు ప్రయాణించిన 50 ఏళ్ల మహిళ ఉదంతం వెలుగుచూసింది. తన కోడలు, మరో బంధువుతో కలిసి ఆ మహిళ లాక్‌డౌన్ నిర్బంధాల మధ్య మూడు రోజుల పాటు ప్రయాణం కొనసాగించి కొడుకు చెంతకు చేరింది. కండరాల వాపు వ్యాధితో బాధపడిన తన కుమారుడు అరుణ్ కుమార్ (29)ఆరోగ్యం ఇప్పుడు కొద్దిగా మెరుగైందని రాజస్ధాన్‌లోని జోధ్‌పూర్‌లో షీలమ్మ వాసన్ చెప్పారు.
దేవుడి దయ వల్ల ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా ఇక్కడకు చేరుకున్నామని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. జోధ్‌పూర్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్‌గా అనిల్ కుమార్ పనిచేస్తున్నారు. అనిల్ ఆరోగ్యం బాగాలేదని, కుటుంబ సభ్యులను చూడాలనుకుంటున్నారని అక్కడి ఎయిమ్స్‌లోని మళయాళీ డాక్టర్ కేరళలో నివసించే అనిల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో షీలమ్మ వాసన్ లాక్‌డౌన్ నియంత్రణలను లెక్కచేయకుండా కుమారుడిని చూసేందుకు బయలుదేరారు. కేంద్ర మంత్రి వి మురళీధరన్, సీఎం పినరయి విజయన్ కార్యాలయం, కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీల చొరవతో పలు రాష్ట్రాలను దాటుతూ వీరి ప్రయాణం సాఫీగా సాగింది.
వీహెచ్‌పీ అనుబంధ హిందూ హెల్ప్‌లైన్ సభ్యులు ఓ క్యాబ్‌తో పాటు ఇద్దరు డ్రైవర్లను వారిని జోధ్‌పూర్‌కు తీసుకువెళ్లేందుకు ఉచితంగా సమకూర్చారు. కొట్టాయం జిల్లా కలెక్టర్ పీకే సుధీర్ బాబు అవసరమైన పాస్‌లను ఇవ్వడంతో షీలమ్మతో పాటు ఆమె కోడలు, మరో బంధువు కొట్టాయంలోని పనక్‌చిరా గ్రామం నుంచి ఏప్రిల్ 11న బయలుదేరి 14న మళయాళీ నూతన సంవత్సరం రోజున జోధ్‌పూర్ చేరుకున్నారు. వారు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల మీదుగా ప్రయాణించి రాజస్ధాన్‌లో అడుగుపెట్టారు.
ఇక ఫిబ్రవరిలో సెలవులు ఇవ్వడంతో గ్రామానికి వచ్చిన జవాన్ అనిల్ కుమార్ కొద్దిరోజుల తర్వాత తిరిగి జోధ్‌పూర్ వెళ్లిన కొద్దివారాలకే అస్వస్ధతకు లోనయ్యారు. తన ఆరోగ్యం బాగాలేదని తన తల్లి, భార్యను చూడాలని వైద్యులకు చెప్పడంతో వారు అనిల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో ఏపీలో చిక్కుకున్న తన కుమారుడిని తీసుకువచ్చేందుకు తెలంగాణకు చెందిన రజియా సుల్తానా అనే మహిళ బోధన్ నుంచి నెల్లూరు వరకూ స్కూటీపైన 1400 కిమీ ప్రయాణించిన ఉదంతం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment