
సెంట్రల్ జైల్లో వ్యభిచారం చేయమని వేధిస్తున్నారు!
బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నకొంతమంది మహిళా ఖైదీలను లైంగికంగా వేధిస్తున్న ఘటన వెలుగుచూసింది.
బెంగళూరు: ఇది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఆశ్యర్యకరమైన అంశం. మహిళలకు ఎక్కడకు వెళ్లినా సరైన రక్షణ లేదనేది ఈ తాజా ఉదంతంతో మరోసారి రుజువైంది. నగరంలోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నకొంతమంది మహిళా ఖైదీలను లైంగికంగా వేధిస్తున్నఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధిత మహిళా ఖైదీలు రాసిన రెండు లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. హైకోర్టు అడ్రస్ తో రాసిన ఆ లేఖలు ఫిర్యాదు బ్యాక్స్ లో వెలుగుచూడటంతో పెద్ద దుమారం రేపుతోంది.
జైల్లో జరిగే ఆకృత్యాలపై బాధిత మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను మగ ఖైదీలతో వ్యభిచారం చేయాలని స్వయంగా జైలు వార్డన్లే వేధిస్తున్నారని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మగ ఖైదీల నుంచి జైలు వార్డెన్లు రూ.300 నుంచి 400 వరకూ తీసుకుంటున్నట్లు బాధిత ఖైదీలు పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తమను పెరోల్ పై బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించినట్లు మహిళా ఖైదీలు పేర్కొన్నారు. అయితే ఆ లేఖలపై తేదీ తదితర వివరాలు లేకపోయినా.. ఆ లేఖలు వచ్చి 10 నెలలుగా పైగా అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.