Women inmates
-
జైలు నుంచి పరారైన మహిళా ఖైదీల అరెస్ట్
తిరువనంతపురం : రెండు రోజుల క్రితం జైలు నుంచి తప్పించుకుపోయిన మహిళా ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కేరళలోని తిరునవనంతపురం జిల్లా అట్టక్కులంగర మహిళల జైలు నుంచి సంధ్య(26), శిల్ప(23) అనే ఇద్దరు మహిళా ఖైదీలు మంగళవారం పారిపోయారు. సాయంత్రం జైలులో ఖైదీల సంఖ్యను లెక్కించే సమయంలో ఈ విషయం వెలుగుచూసింది. జైలు సమీపంలో ఉన్న చెట్టు ఎక్కి వీరు తప్పించుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ విధంగా పగటిపూటే మహిళా ఖైదీలు జైలు నుంచి పరారుకావడం ఇదే తొలిసారి కావడంతో ఈ సంఘటన వార్తలో నిలిచింది. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసలు.. వారి ఆచూకీ కోసం తమిళనాడులో కూడా గాలింపు చేపట్టారు. చివరకు గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో పాలోడ్ సమీపంలో వారిని అరెస్ట్ చేశారు. కాగా, శిల్ప చోరీ కేసులో, సంధ్య చీటింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్నారు. -
సెంట్రల్ జైల్లో వ్యభిచారం చేయమని వేధిస్తున్నారు!
బెంగళూరు: ఇది నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఆశ్యర్యకరమైన అంశం. మహిళలకు ఎక్కడకు వెళ్లినా సరైన రక్షణ లేదనేది ఈ తాజా ఉదంతంతో మరోసారి రుజువైంది. నగరంలోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నకొంతమంది మహిళా ఖైదీలను లైంగికంగా వేధిస్తున్నఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి బాధిత మహిళా ఖైదీలు రాసిన రెండు లేఖలు కలకలం సృష్టిస్తున్నాయి. హైకోర్టు అడ్రస్ తో రాసిన ఆ లేఖలు ఫిర్యాదు బ్యాక్స్ లో వెలుగుచూడటంతో పెద్ద దుమారం రేపుతోంది. జైల్లో జరిగే ఆకృత్యాలపై బాధిత మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమను మగ ఖైదీలతో వ్యభిచారం చేయాలని స్వయంగా జైలు వార్డన్లే వేధిస్తున్నారని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మగ ఖైదీల నుంచి జైలు వార్డెన్లు రూ.300 నుంచి 400 వరకూ తీసుకుంటున్నట్లు బాధిత ఖైదీలు పేర్కొన్నారు. ఒకవేళ అలా చేయకపోతే తమను పెరోల్ పై బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించినట్లు మహిళా ఖైదీలు పేర్కొన్నారు. అయితే ఆ లేఖలపై తేదీ తదితర వివరాలు లేకపోయినా.. ఆ లేఖలు వచ్చి 10 నెలలుగా పైగా అయ్యి ఉంటుందని అంచనా వేస్తున్నారు.