సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఎస్పీ నేత ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలు శుక్రవారం కూడా లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించాయి. రమాదేవి బుధవారం సభాధ్యక్ష స్ధానంలో కూర్చుండగా ఆమెను ఉద్దేశించి ఆజం ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన క్షమాపణలు చెప్పాలని అన్ని పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. మహిళా ఎంపీలంతా పార్టీలకు అతీతంగా ఆజం ఖాన్ ప్రకటనను ఖండిస్తూ ఆయనపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిళా నేతపై అలాంటి వ్యాఖ్యలు చేసిఉండాల్సింది కాదని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ అంశాన్ని లేవనెత్తుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమర్యాదకరంగా వ్యవహరించి ఆజం ఖాన్ తప్పించుకోలేరని ఆమె హెచ్చరించారు. ఇవే వ్యాఖ్యలను ఆయన బయట చేస్తే పోలీసులు అరెస్ట్ చేసేవారని చెప్పారు. ఆజం ఖాన్ వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆయన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని..ఈ తరహా భాష ఆమోదం యోగ్యం కాదని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఆజం ఖాన్ తన వ్యవహారశైలిని మార్చుకోకుంటే ముందు తరాలకు మంచి విలువలు అందించలేమని వ్యాఖ్యానించారు.
నిన్న జరిగిన ఉదంతంపై ప్రతి ఒక్కరూ ఇలా మాట్లాడటం కాదని, ఆజం ఖాన్‌పై తీవ్ర చర్యల కోసం తాము లోక్‌సభ స్పీకర్ వైపు చూస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మహిళా ఎంపీల డిమాండ్లపై స్పందించిన స్పీకర్ ఓం బిర్లా తాను అన్ని పార్టీల నేతలతో సమావేశం ఏర్పాటు చేసి చర్చించిన మీదట ఈ అంశంపై తన నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. అంతకుముందు తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆజం ఖాన్‌ను లోక్‌సభ నుంచి డిస్మిస్ చేయాలని, ఆయన ఎన్నడూ మహిళలను గౌరవించరని బీజేపీ ఎంపీ రమాదేవి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment