'మహిళలు దిగితే విప్లవమే'
పాలంపూర్: అన్ని రంగాల్లో దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహిళలు వ్యవసాయరంగంలో కూడా ప్రవేశించి ఆ రంగాన్ని కూడా ఉరకలెత్తించాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆచార్య దెవ్రాత్ అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని పటిష్టం చేసేందుకు మహిళలు తప్పకుండా ఆ రంగాన్ని కూడా ఎంచుకోవాలని సూచించారు.
మహిళలు నిజంగా జోక్యం చేసుకుంటే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు కనిపించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో మహిళలు కేవలం కష్టపడి పనిచేయడం లేదు. ప్రతి రంగంలో వారి శక్తి ఏమిటో నిరూపిస్తున్నారు. అందుకే వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని దానిపై విస్తృత అధ్యయనం చేసి కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రభావవంతమైన పంటలను పండించాలి' అని ఆయన చెప్పారు. రైతులు కూడా ఎక్కువగా సాంప్రదాయబద్ధమైన, ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయ దిగుబడులు పెంచి మార్కెట్లో అధిక లాభాలు ఆర్జించుకోవచ్చని సూచించారు.