హిమాచల్‌లో దారుణం.. కోడలి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి | Woman's face blackened, hair cut and paraded by in-laws in Himachal Pradesh | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో దారుణం.. కోడలి జుట్టు కత్తిరించి, ముఖానికి నల్లరంగు పూసి

Published Sat, Sep 16 2023 10:37 AM | Last Updated on Sat, Sep 16 2023 11:27 AM

Woma Face blackened Hair cut Paraded In village by inlaws Himachal - Sakshi

హిమాచల్‌ ప్రదేశ్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల మహిళ జుట్టు కత్తిరించిన అత్తమామలు ఆమెను తీవ్రంగా వేధించారు. కోడలు ముఖానికి నల్లరంగు పూసి గ్రామంలో ఊరేగించారు. హిమాచల్‌ సీఎం సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖ సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని భోరంజ్ సబ్‌డివిజన్‌లోని ఓ గ్రామంలో ఆగస్టు 31 జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసుంది. 

అత్తమామల దాష్టీకానికి సంబంధించిన మూడు నిముషాల వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌ అయ్యింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అత్తమామలతో సహా అయిదుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల మేరకు.. మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహామైంది.  ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తన ఇంటికి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాగానే అత్తమామలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు. కోడలికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో అత్తమామలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తమామలపై కేసు ఫైల్‌ చేసి చర్యలు తీసుకుంటున్నామని హమీర్‌పూర్ ఎస్పీ ఆకృతి శర్మ తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, తదుపరి విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. 

ఈ ఘటన దురదృష్టకరమని హిమాచల్ ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ప్రబోధ్ సక్సేనా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిందని, కేసును విచారిస్తున్న అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలని తెలిపారు. ఈ కేసులో బాధిత మహిళ వాంగ్మూలాన్ని తీసుకున్నామని, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో ఈ అంశం రాజకీయ విమర్శలకు దారితీసింది. శాంతిభద్రతలు పూర్తిగా స్తంభించాయని హిమాచల్ బీజేపీ కార్యదర్శి నరేంద్ర అత్రి అన్నారు. ఎలాంటి భయం లేకుండా సంఘ వ్యతిరేకులు నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement