బాలిక కాదు.. బాహుబలి!
బెంగళూరు: భారతదేశంలోనే అత్యధిక బరువుతో పుట్టిన ఆడ శిశువుకు, బెంగళూరు మహిళ జన్మనిచ్చింది. నందిని అనే గర్భిణికి హసన్ ఆస్పత్రిలో సోమవారం పుట్టిన బాలిక 6.82 కిలోల బరువు ఉందని డాక్టర్లు వెల్లడించారు. అప్పుడే పుట్టిన శిశువులు సగటున 3.4 కిలోల వరకు బరువుంటారు. తన 25 ఏళ్ల సర్వీసులో ఇంత భారీగా బరువున్న ఆడ శిశువును ఎప్పుడూ చూడలేదంటూ డాక్టర్ వెంకటేశ్ రాజు అనే స్థానిక వైద్యాధికారి ఆశ్చర్యపోయారు.
బిడ్డకు తగ్గట్టే తల్లి నందిని కూడా 5.9 అడుగుల ఎత్తు, 94 కిలోల బరువు ఉన్నారు. ప్రస్తుతం ఈ శిశువును ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచి ఆమె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శిశువు ఆరోగ్యం అన్ని విధాలా బాగుందని, అయితే ఆమె భారీ కాయాన్ని చూసి అంతా విస్తుపోయామని సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించిన గైనకాలజిస్టు డాక్టర్ పూర్ణిమ మణు వివరించారు. గత ఏడాది కూడా ఫిర్దోస్ ఖాటూన్ అనే మహిళ 6.7 కిలోల బరువున్న మగ శిశువుకు జన్మనిచ్చారు. నందిని కుమార్తె ఇంతకంటే ఎక్కువ బరువు ఉండటం విశేషం.