'కీలక నరాలు తెగడం వల్లే అరవలేకపోయాడు'
న్యూఢిల్లీ : గుర్గావ్‌లో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసుకు సంబంధించి శవ పరీక్ష నివేదిక వెల్లడైంది. బాలుడి మెడమీద కత్తితో కోయడంతో పలు ముఖ్యమైన నరాలు తెగిపోయిన కారణంగా అతడు అరవలేకపోయాడని వైద్యులు తెలిపారు. మొత్తం రెండుసార్లు బాలుడి మెడను కత్తితో కోశారని, అందులో ఒక గాయం బాలుడి ముఖ్యమైన నరాలు తెంపేసిందని, దాంతో అతడు అరిచే ప్రయత్నం చేసినా అరవలేకపోయినట్లు వెల్లడించారు. విపరీతంగా రక్తస్రావం అవడంతోనే బాలుడు మృత్యువాతపడ్డాడని చెప్పారు. అయితే, బాలుడిపై లైంగిక దాడి జరగలేదన్నారు.
గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ఆ స్కూల్‌కు చెందిన బస్సు కండక్టర్ అతి దారుణంగా కత్తితో చంపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. మరోపక్క, తమ పిల్లలకు పూర్తి భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐదో రోజు కూడా నేవీ ముంబయి పాఠశాలలో తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్రమంత్రులు మనేకా గాంధీ, ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఇందుకోసం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు.