
'దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు వ్యూహం పన్నింది నేనే'
ఢిల్లీ: దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత యాసిన్ భత్కల్ అంగీకరించాడు. హైదరాబాద్ నగరంలో బాంబు పేలుళ్లకు వ్యూహ రచన చేసి విధ్వంసానికి కారణమైనట్లు తెలిపాడు. దీంతో హైదరాబాద్ పోలీసులు ఢిల్లీకి పయనం కానున్నారు. పేలుళ్లకు సూత్రధారి తానేనని భత్కల్ విచారణలో తెలపడంతో నగర పోలీసులు ఢిల్లీకి పయనమైందేకు సిద్ధమవుతున్నారు. ఈ విచారణంలో నేషనల్ ఇన్విస్టిగేషన్ టీం సభ్యులు కూడా నగర పోలీసులకు జతకలవనున్నారు.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు గత గురువారం ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. ఇప్పటి వరకూ వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ భారత్ -నేపాల్ సరిహద్దులో దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అతనిపై విచారణ వేగవంతంగా కొనసాగుతోంది.