మామూలోడుకాదు.. ఇండియా బిన్‌ లాడెన్‌!! | Abdul Subhan Qureshi is called as India's Bin Laden | Sakshi
Sakshi News home page

మామూలోడుకాదు.. ఇండియా బిన్‌ లాడెన్‌!!

Published Mon, Jan 22 2018 3:09 PM | Last Updated on Tue, Jan 23 2018 3:14 AM

Abdul Subhan Qureshi is called as India's Bin Laden - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒకప్పుడు తెలివైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌! ఇప్పుడు పోలీసుల దృష్టిలో ‘ఇండియా బిన్‌ లాడెన్‌’!! గణతంత్రదినోత్సవానికి కొద్ది రోజుల ముందు దేశరాజధానిలో సంచలన రీతితో పట్టుబడిన అబ్దుల్‌ సుభాన్‌ ఖురేషీ(46) అలియాస్‌ తౌఖీర్‌ మామూలోడుకాదని పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ ఘాజీపూర్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్న ఖురేషీని ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసింది. యాంటీ టెర్రరిస్టు వ్యవహారాలకు సంబంధించి ఖురేషీ అరెస్టు గొప్ప ముందడుగని పోలీసులు పేర్కొన్నారు.

టెకీగా పలు కంపెనీల్లో : ఖురేషీ కుటుంబీకులు దశాబ్ధాల కిందటే ఉత్తరప్రదేశ్‌ నుంచి ముంబైకి వలసవచ్చారు. అతని విద్యాబ్యాసమంతా ముంబైలోనే సాగింది. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివిన ఖురేషీ.. పలు సంస్థల్లో ఉద్యోగాలు కూడా చేశాడు. ముంబై మతకలహాల తర్వాత ఉగ్రవాదానికి ప్రభావితులైన వ్యక్తుల్లో ఇతనూ ఒకడు. మొదట స్టుడెంట్‌ ఇస్లామిక్‌ మూమెంట్ ఆఫ్‌ ఇండియా ‌(సిమి)లో చేరి క్రియాశీలకంగా పనిచేశాడు. ఆ సంస్థకు అనుబంధంగా దాడులకు పాల్పడే గ్రూపు ఒకటి 2008లో అహ్మదాబాద్‌లో వరుసపేలుళ్లకు పాల్పడింది. సాంకేతిక విషయాలపై గట్టిపట్టున్న ఖురేషీనే.. ఆ బాంబులు తయారుచేశాడని పోలీసులు చెబుతారు. నాటి ఘటనలో 56 మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖురేషీ.. అనంతరకాలంలో ‘ఇండియన్‌ ముజాహిద్దీన్‌(ఐఎం)’ ఉగ్రసంస్థ ఏర్పాటులోనూ విశేషమైన పోషించాడు. ఐఎం సహవ్యవస్థాపకుడిగా.. యువతను సమీకరించి, వారిలో జాతివ్యతిరేక భావజాలాన్ని పురిగొల్పేలా ఖురేషీ క్లాసులు తీసుకునేవాడు.

విదేశాల నుంచి ఎందుకొచ్చినట్లు? : అహ్మదాబాద్‌ పేలుళ్ల తర్వాత చాలా కాలం కనిపించకుండా పోయిన ఖురేషీ అలియాస్‌ తౌఖీర్‌.. బంగ్లాదేశ్‌లో తలదాచుకున్నట్లు 2004లో వెల్లడైంది. అంతకుముందు అతను నేపాల్‌, సౌదీ అరేబియా తదితర దేశాల్లోనూ కొన్నాళ్లు గడిపినట్లు తెలిసింది. ఖురేషీని పట్టుకునేందుకు ప్రయత్నించిన అన్నిసార్లూ విఫలమైన భారత పోలీసులు.. ఇంటర్‌పోల్‌ ద్వారా అతనిపై రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీచేయించారు. అతని తలపై రూ.4లక్షల బహుమతి కూడా ఉంది. ఇన్నాళ్లూ విదేశాల్లో గడిపిన ఖురేషీ.. ఏకంగా ఢిల్లీలో పట్టుబడటం సంచలనంగా మారింది. భారత్‌లో ఐఎం కార్యకలాపాలను పునఃప్రారంభించే క్రమంలోనే అతను ఇండియాకు వచ్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఖురేషీ అరెస్టు నేపథ్యంలో రిపబ్లిక్‌డే వేడుకల బందోబస్తును మరింత పటిష్టంచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement