సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన ప్రయోజనాలను దక్కకుండా చేసి ఇప్పుడు చంద్రబాబు తన మంత్రులను ఉపసంహరించుకోవడం వల్ల ప్రజల మనసులు గెలవలేరు. ప్యాకేజీకి ఒప్పుకొన్నప్పుడే ప్రజల విశ్వాసం కోల్పోయారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ధ్వజమెత్తారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, వైఎస్ అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి గురువారం ఉదయం పదిన్నరకు పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ‘ఏపీకి న్యాయం చేయాలి’, ‘ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అంటూ నినదించారు.
ఈ సందర్భంగా వారంతా మీడియాతో మాట్లాడారు. ‘‘మంత్రులు రాజీనామా చేయడమే కాదు. మేం పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. లేదంటే వారే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. తదుపరి ఏపీకి చెందిన ఎంపీలంతా రాజీనామా చేయాలి. అంతేతప్ప మంత్రుల్ని ఉపసంహరించుకుంటాం.. ఎన్డీయేలో కొనసాగుతాం వంటి మాటలు వద్దు’’ అని స్పష్టం చేశారు.
అనంతరం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమవగానే ఎంపీలు సభలో ఆందోళన కొనసాగించారు. వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే సమయంలో టీడీపీ, టీఆర్‌ఎస్, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్‌లకు చెందిన సభ్యులు వేర్వేరు అంశాలపై ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేశారు. తిరిగి 12 గంటలకు ప్రారంభమైనప్పటికీ ఆందోళన కొనసాగడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు.
జేసీ సవాలును తిప్పికొట్టిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు..
ఇదిలా ఉండగా పార్లమెంటు ప్రధాన ద్వారం వద్ద గురువారం ఆందోళన చేస్తున్న వైఎస్సార్‌సీపీ సభ్యుల వద్దకొచ్చిన టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మీసం మెలేస్తూ.. తొడ కొడుతూ.. ‘మీకు మగతనముంటే బయటకు రండి.. మేం వచ్చేశాం.. మా మంత్రులు రాజీనామా చేశారు..’ అంటూ సవాలుకు దిగారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రతిస్పందిస్తూ.. ‘మేం ఎన్డీయేలో లేం బయటకు రావడానికి... ఏప్రిల్ 6న రాజీనామా చేస్తున్నామని మేం ముందే ప్రకటించాం..’ అంటూ తిప్పికొట్టారు. ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ ఆయనకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment