కంటితుడుపు ప్రకటనైనా చేయండి..
• బంద్ విజయవంతం కావడంతో కేంద్రం కాళ్లావేళ్లా పడ్డ టీడీపీ
• ఏదోలా తమను గట్టెక్కించాలని జైట్లీకి చంద్రబాబు వేడుకోలు
• సత్వర పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని జైట్లీ ఏకవాక్య ప్రకటన
• ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ సరికొత్త డ్రామా
• అంతకుముందు లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఆందోళన
• బీఏసీలో నిర్ణయం తీసుకుందామని స్పీకర్ విజ్ఞప్తి
• ప్రకటన వచ్చేవరకూ ఆందోళన ఆగదన్న మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్ బంద్ విజయవంతం కావడంతో అధికార తెలుగుదేశం పార్టీ లోక్‌సభలో సరికొత్త డ్రామాకు తెరలేపింది. తమ ఆందోళన కారణంగానే కేంద్రం ప్రకటన చేసిందని చెప్పుకునేందుకు వీలుగా మంగళవారం మిత్రపక్షం బీజేపీతో కలిసి నాటకాన్ని రక్తి కట్టించింది. బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో ఆందోళనకు లోనైన చంద్రబాబు... కంటితుడుపు ప్రకటనైనా చేసి తమను గట్టెక్కించాలంటూ కేంద్రం కాళ్లావేళ్లా పడ్డారు. ప్రత్యేక హోదా విషయమై మేం నినాదాలు చేస్తే.. మీరు హామీ ఇచ్చినట్టుగా ఓ ప్రకటన చేయాలంటూ ప్రాధేయపడ్డారు.
చివరకు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేకుండా... హామీలను త్వరగా పరిష్కరించేందుకు గల మార్గాన్ని వెతుకుతున్నామన్న జైట్లీ ఏకవాక్య ప్రకటనతో సరిపెట్టుకున్నారు. మిత్రలాభం కోసం మిత్రపక్షాలు ఇలా ప్రత్యేక హోదా అంశానికి మరోసారి విరామం ప్రకటించాయి. వైఎస్సార్‌సీపీకి మైలేజీ రాకుండా ఉండేందుకు తన అనుకూల మీడియాను రంగంలోకి దించడం... వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రెస్‌మీట్ సమయంలోనే సుజనా చౌదరి ప్రెస్‌మీట్, ఆ తర్వాత ముఖ్యమంత్రి విలేకరులు సమావేశం కూడా టీడీపీ డ్రామాలో భాగమే.
జైట్లీతో చంద్రబాబు మంతనాలు...
ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యంతో రాష్ట్ర బంద్ విజయవంతమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై సభలో ఏదో ఒక ప్రకటన చేయాలని, అప్పుడే తాము ఈ సమస్య నుంచి బయటపడే పరిస్థితి ఉంటుందని కోరారు. అందుకు జైట్లీ సమ్మతించడంతో చంద్రబాబు తమ పార్టీ ఎంపీలకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నర్సింహులు సభలోకి చేరుకుని జైట్లీతో మాట్లాడారు.
ఆ వెంటనే అందుబాటులో ఉన్న ఎంపీలను సభలోకి పిలిచారు. వెంటనే అరుణ్ జైట్లీ లేచి... ‘ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు కూడా నేను ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడాను. ఈ అంశాలను త్వరగా పరిష్కరించేందుకు గల మార్గాన్ని వెతుకుతున్నాం..’ అని ఏకవాక్య ప్రకటన చేశారు. మిత్రపక్షాలు రెండూ కూడబలుక్కుని ప్రత్యేకహోదా అంశంపై మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రకటనతో సరిపెట్టారు.
‘హోదా’ ఆందోళనకు టీడీపీ విరామం
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంటులో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విరామం ప్రకటించింది. విభజన చట్టంలోని హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ లభించడంతో... లోక్‌సభలో రెండు రోజులుగా చేస్తున్న ఆందోళనకు తాత్కాలిక విరామం ప్రకటించినట్టు కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. మంగళవారం ఆయన టీడీపీ ఎంపీలతో కలసి ఇక్కడి ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్టు తెలిపారు. సభా వ్యవహారాలను అడ్డుతగలవద్దని జైట్లీ చేసిన విజ్ఞప్తి మేరకు ఆందోళన విరమిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో టీడీపీ ఎంపీలు తోట నరసింహం, రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
హోదా కోసం వైఎస్సార్‌సీపీ పట్టు...
మంగళవారం ఉదయం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందే వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పార్లమెంటు ఆవరణలోని మహాత్ముడి విగ్రహం వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసనలో పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వి.వరప్రసాదరావు, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక హోదా కోసం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సభాకార్యక్రమాలు ప్రారంభం కాగానే సభాపతి సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని రెండో రోజు తమ ఆందోళనను కొనసాగించగా... టీడీపీ ఎంపీలు మాత్రం తమ సీట్ల వద్దే నిలబడ్డారు.
జీరో అవర్‌లో అవకాశమిస్తానని స్పీకర్ చెప్పినా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన విరమించలేదు. జీరోఅవర్‌లోనూ ఆందోళన కొనసాగడంతో స్పీకర్ సభను 12.15 గంటలకు పావుగంట పాటు వాయిదావేశారు. అనంతరం అన్ని పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై చర్చించేందుకు బుధవారం నాటి బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకు నిరసనలు ఆపాలని కోరగా... వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తిరస్కరించారు. హోదా ఇస్తామని చెప్పి, ఇన్నిసార్లు చర్చించాక ఇంకా చర్చలు ఎందుకని, హోదా వర్తింపజేస్తూ ప్రకటన వచ్చేంతవరకు తమ ఆందోళన కొనసాగుతుందని తేల్చిచెప్పారు. నిరసనల మధ్యే సభ మధ్యాహ్నం 1.35 వరకు నడిచింది.